చంద్రబాబు అపాయింట్మెంట్ కోరిన యార్లగడ్డ..! టీడీపీలో చేరిక లాంఛనమే..!?
గన్నవరం రాజకీయం రసవత్తరంగా మారింది. ఇన్నాళ్లూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీ తనను పక్కన పెట్టి మరో పార్టీ నుంచి వచ్చిన వాళ్లను అందలం ఎక్కించడం తనకు బాధ కలిగించిందన్నారు. తాను టీడీపీ నేతలెవరినీ కలవకపోయినా కలిసినట్లు పార్టీ భావిస్తుండడం సరికాదన్నారు. ఇది కచ్చితంగా ఇంటెలిజెన్స్ వైఫల్యమేనన్నారు. అయితే ఇప్పుడు తాను చంద్రబాబు అపాయింట్మెంట్ అడుగుతున్నానని.. పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తానని స్పష్టం చేశారు యార్లగడ్డ. గన్నవరంను వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. అక్కడి నుంచే తాను పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు.
యార్లగడ్డ వెంకట్రావు సుదీర్ఘంగా వైసీపీలో ఉంటున్నారు. అమెరికాలో స్థిరపడిన యార్లగడ్డ.. రాజకీయాలకోసం ఆంధ్రా వచ్చారు. మొదట పెనమలూరు నుంచి పోటీ చేయాలని భావించారు. అయితే గన్నవరం నుంచి పోటీ చేయాలని జగన్ కోరడంతో అక్కడి నుంచి బరిలోకి దిగారు. ఓడిపోయినా అక్కడి నుంచే రాజకీయాలు చేస్తున్నారు. అయితే వైసీపీ గెలిచిన తర్వాత గన్నవరం నుంచి టీడీపీ తరపున గెలిచిన వల్లభనేని వంశీ ఆ పార్టీ గూటికి చేరారు. దీంతో మొదటి నుంచి ఉన్న యార్లగడ్డ వెంకట్రావును పార్టీ పట్టించుకోవడం మానేసింది. మూడున్నరేళ్లుగా యార్లగడ్డకు అపాయింట్మెంట్ కూడా దక్కలేదని సమాచారం. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో తన పయనంపై సమీక్ష చేసుకోవాల్సిన సమయం ఏర్పడింది.
దీంతో యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నేతలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి చేసిన కామెంట్స్ పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ఉంటే ఉండు.. పోతే పో.. అన్నట్టు సజ్జల అన్న తర్వాత ఇక ఆ పార్టీలో ఉండడ కరెక్ట్ కాదని మెజారిటీ నేతలు సూచించారు. ఇండిపెండెంట్ గా పోటీ చేయాలా.. లేకుంటే టీడీపీలో చేరాలా.. అనే దానిపై అభిప్రాయం కోరినప్పుడు ఎక్కువ మంది టీడీపీలో చేరాలని సూచించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. వేదికపైన నుంచే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరారు.
తాను టీడీపీలో చేరబోతున్నానని.. ఆ పార్టీ నేతలతో టచ్ లో ఉన్నట్టు సజ్జల చేసిన కామెంట్స్ ను యార్లగడ్డ వెంకట్రావు ఖండించారు. ఇప్పటివరకూ తాను ఏ టీడీపీ నేతనూ కలవలేదని స్పష్టం చేశారు. కలిసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటానని వెల్లడించారు. అయితే ఇప్పుడు సభాముఖంగానే చంద్రబాబు అపాయింట్మెంట్ కోరుతున్నానని.. ఆయన టికెట్ ఇస్తే పోటీ చేస్తానని అందరి ముందూ ప్రకటించారు. గన్నవరం ప్రజలు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే.. అక్కడ కలుసుకుందామని జగన్ కు సూచించారు. దీంతో యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరడం ఖాయమని రుజువైంది. ఆయన 22న టీడీపీలో చేరతారనే టాక్ నడుస్తోంది.













