ఏపీ ప్రభుత్వం విఫలమైంది…అందుకే బడ్జెట్ లో కేటాయింపులు లేవు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా లేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంతో ఏపీ ప్రభుత్వం విఫలమైందని, అందుకే రాష్ట్రానికి సరైన కేటాయింపులు జరగలేదని విమర్శించారు. ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించేలా, పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ లేదన్నారు. కరోనా వల్ల దెబ్బతిన్న రంగాలు తిరిగి కొలుకునే విధంగా బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు చేయలేదని ఆక్షేపించారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు నిధులు కేటాయించలేదని, దీని ద్వారా దేశ యువతలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల పేర్లు కూడా ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తూ రాష్ట్రానికి చేయూతనిచ్చేలా ఎలాంటి అంశాలను బడ్జెట్లో ప్రస్తావించలేదన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రత్యేక హోదా వస్తే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని చెప్పిన సీఎం, ఇప్పుడు హోదా గురించి ఎందుకు అడగటం లేదని నిలదీశారు. తనపై ఉన్న కేసుల విషయమై మాత్రమే జగన్ ఢిల్లీ వెళ్లివస్తున్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌పై చిన్నచూపు ఏర్పడిందన్నారు. విభజన చట్టం అమలుకు సంబంధించి బడ్జెట్లో ఎటువంటి అంశాలూ ప్రస్తావించలేదన్నారు. వైకాపా ఎంపీలు సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన ప్రాధాన్యత దక్కకపోవడానికి ముఖ్యమంత్రి జగన్ వైఖరే కారణమని మండిపడ్డారు.












