ఏ1, ఏ2 సూత్రధారులు అయితే.. అరబిందో, హెటిరో పాత్రధారులు
విశాఖ స్టీల్‌ప్లాంట్ భూముల్ని తన చేతికి మట్టి అంటకుండా కేంద్రం ద్వారా అమ్మించి తన బినామీల పరం చేయాలన్నది జగన్నాటకమని శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. స్టీల్ ప్లాంట్ భూములను తన బినామీలకు కట్టబెట్టే రహస్య అజెండా తొలి అంకంలో భాగంగానే జగన్ మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాశారని మండిపడ్డారు. ఏ1 జగన్, ఏ2 విజయసాయిరెడ్డి అమ్మకం కుట్రలో సూత్రధారులు అయితే పాత్రధారులు అరబిందో, హెటిరో అని దుయ్యబట్టారు. కాకినాడ సెజ్, బే పార్క్ భూములను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారన్న యనమల.. తొలుత విశాఖ భూములు, ఆశ్రమ భూములపై గద్దల్లా వాలి ఇప్పుడు స్టీల్ ప్లాంట్ భూములపై కన్నేశారని ఆక్షేపించారు.
ముఖ్యమంత్రి మాటలను బట్టి పోస్కోతో ఒప్పందం నిజమేనని తెలుస్తోందన్నారు. ఎకరా రూ.3 కోట్ల విలువ చేసే ఈ భూముల ప్రయోజనం స్థానికులకే దక్కాలి తప్ప జగన్ బినామీల పరం కాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి తమ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కార్మిక సంఘాలు కోరుతుంటే వారిని పట్టించుకోకుండా యాగానికి వెళ్లడం ఎంత వరకు సబబని యనమల నిలదీశారు.













