విజయవాడలో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో మరోసారి తెలుగుభాషాభివృద్ధికి వేదిక కాబోతోంది. డిసెంబర్ 23 నుంచి మూడు రోజుల పాటు ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాలని నిర్ణయించారు. కృష్ణా జిల్లా రచయితల సంఘం సహకారంతో ఈ మహాసభలను నిర్వహించనున్నారు. మారుతున్న దేశకాలమాన పరిస్థితుల్లో తెలుగుభాష, సంస్కృతి, చరిత్ర సామాజిక రంగాలకు సంబంధించిన పలు అంశాలపై రచయితల పాత్ర కర్తవ్యం, కార్యాచరణ లక్ష్యాలుగా ఈ సభలలో సదస్సులు, ఇతర కార్యక్రమాల రూపకల్పన జరుగుతోంది. దేశవిదేశాల నుంచి 2 వేల మంది తెలుగు రచయితలు, తెలుగు భాషాభిమానులు ఈ సభలకు రానున్నారు. భాషా సంస్కృతి, సామాజిక విలువలు పతనం అంచున నడుస్తున్న ఈ సమయంలో రచయితలను కర్తవ్యోన్ముఖులును చేయడానికి ఈ సభలు ఉపయుక్తంగా ఉంటాయని గౌరవాధ్యక్షుడు మండలి బుద్ధప్రసాద్, అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి జి.వి.పూర్ణచందు తెలిపారు.













