ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
తెలుగు వెలుగులు విరజ్మిమాయి. ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలు విజయవాడలో కనుల పండువగా ప్రారంభమయ్యాయి. పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ ఆడిటోరియంలో మూడు రోజులపాటు జరిగే ఈ సభలను కేంద్ర సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార ప్రారంభించారు. చివరకు మిగిలేది నవలా రచయిత బుచ్చిబాబు సతీమణి శివరాజు సుబ్బలక్ష్మి జ్యోతి ప్రకాశనం చేశారు. మహాసభల సందర్భంగా రూపొందించిన తెలుగు ప్రపంచం పుస్తకాన్ని సిద్థార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు, ప్రపంచ తెలుగు పుస్తకాన్ని శాంత బయోటిక్స్ అధినేత కె.ఐ.వరప్రసాదరెడ్డి ఆవిష్కరించారు.
సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, తెలుగుభాషా సంస్కృతులపై పరిశోదనలు చేస్తున్న ఫ్రెంచ్ ఆచార్యుడు డేనియల్ నెగర్స్, కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి కృత్తివెన్ను శ్రీనివాసరావు, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అప్పాజోశ్యుల సత్యనారాయణ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జొన్నవిత్తుల చేసిన చతుర్ముఖ పారాయణం ఆకట్టుకుంది. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి మొత్తం 1,600 మంది ప్రతినిధులు హాజరయ్యారు.













