World Telugu Writers: ఘనంగా ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు ప్రారంభం
ప్రపంచ ఆరో తెలుగు రచయితల మహాసభలు(World Telugu Writers Conference) విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. సుప్రీంకోర్టు పూర్వ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ(Justice N.V. Ramana) , మార్గదర్శి ఎండీ శైలజా కిరణ్ జ్యోతి ప్రజ్వలన చేశారు. అంతకుముందు వీరు తెలుగు తల్లి విగ్రహానికి అంజలి ఘటించారు. ఎమ్మెల్యేలు సుజనా చౌదరి(Sujana Chowdhury), మండలి బుద్ధ ప్రసాద్(Buddha Prasad), విశ్వహిందీ పరిషత్తు జాతీయ అధ్యక్షుడు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, తెలంగాణ శాసనమండలి సభ్యుడు, కవి గోరటి వెంకన్న, సినీ గేయ కవి భువనచంద్ర, ఆచార్య కొలకలూరి ఇనాక్ మహాసభల్లో పాల్గొన్నారు. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలుగు మహనీయుల ఫొటో ప్రదర్శనను అథిథులు తిలకించారు.
విజయవాడ నగరంలోని కె.బి.ఎన్. కళాశాల ప్రాంగణంలో నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే ఈ వేడుకల కోసం దేశవిదేశాల నుంచి 1500 మందికి పైగా కవులు, రచయితలు, భాషాభిమానులు తరలివచ్చారు. పొట్టి శ్రీరాములు సభా ప్రాంగణంలోని చెరుకూరి రామోజీరావు ప్రధాన వేదికతో పాటు మరో రెండు వేదికలనూ సదస్సులు, కవితా, సాహిత్య సమ్మేళనాల కోసం సిద్ధం చేశారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం, కె.బి.యన్.కళాశాల సంయుక్త ఆధ్వర్యంలో వీటిని నిర్వహిస్తున్నారు.













