Social Media: మహిళల భద్రత ..సోషల్ మీడియాపై కఠిన చర్యలకు కూటమి సన్నాహాలు..

సోషల్ మీడియా (Social Media) ఈ రోజుల్లో ఎంతటి శక్తివంతమైన వేదికగా మారిందో అందరికీ తెలిసిందే. ఒకప్పుడు పత్రికలు లేదా టెలివిజన్ ద్వారా మాత్రమే సమాచారం అందుకునే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ప్రతీ వ్యక్తి స్వయంగా ఒక మీడియా హౌస్ లాంటి వాడిగా మారిపోయాడు. తన ఆలోచనలు, తన అనుభవాలు, తన ప్రతిభను క్షణాల్లో ప్రపంచానికి చేరవేయగలుగుతున్నాడు. ఈ మార్పు నిజంగా ఒక సామాజిక విప్లవం అని చెప్పుకోవచ్చు.
అయితే ఈ విప్లవం వెనక ఒక చీకటి కోణం కూడా కనిపిస్తోంది. మంచి కోసం ఉపయోగించుకోవాల్సిన ఈ వేదికను కొందరు అనుచితంగా వాడుతున్నారు. ఒక డాక్టర్ చేతిలో కత్తి ప్రాణం పోస్తే ఒక సైకో చేతిలో కత్తి ప్రాణం తీస్తుంది అన్నట్లుగా మంచికి ఉపయోగపడాల్సిన సోషల్ మీడియాని చాలామంది తమ స్వార్థానికి నెగటివ్ గా ఉపయోగిస్తున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియా అవమానాలు, తిట్లు, వ్యక్తిత్వ హననాలకు కేంద్రంగా మారిపోయింది. ముఖ్యంగా మహిళలపై అనవసరమైన కామెంట్లు, అసభ్య పదజాలం విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
రాజకీయ పార్టీలు తమ ప్రచారం కోసం సోషల్ మీడియాలో విస్తృతంగా ఆధారపడుతున్నాయి. కానీ అదే సమయంలో పార్టీల మధ్య తిట్ల యుద్ధాలు, పరస్పర విమర్శలు పెరిగి వేదికను మరింత కలుషితం చేస్తున్నాయి. సాధారణంగా తమ సమస్యలు చెప్పుకోవడానికి లేదా ప్రతిభను చూపించడానికి సోషల్ మీడియాను వాడాల్సిన ప్రజలు కూడా ఈ వాతావరణంలో నష్టపోతున్నారు. ఇంట్లో ఉన్న అమాయక స్త్రీలను కూడా ఈ వేదికలో అనవసరంగా లాగి కించపరచడం వరకు జరుగుతోంది.
ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం ముందడుగు వేసింది. సోషల్ మీడియాలో మహిళలను దూషించే లేదా అసభ్యంగా చూపించే పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవడానికి మంత్రివర్గ ఉపసమితి ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో మంత్రులు వంగలపూడి అనిత (Vangalapudi Anitha), నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), సత్యకుమార్ యాదవ్ (Satyakumar Yadav), కొలుసు పార్ధసారధి (Kolusu Parthasarathy) ఉన్నారు. త్వరలోనే ఈ ఉపసమితికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి.
ఈ కమిటీ మూడు నెలల పాటు సమగ్రంగా అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగా రాబోయే శీతాకాల సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనున్నారు. డిసెంబర్ లో అసెంబ్లీలో ఆ చట్టం ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. చట్టం అమలులోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో మహిళలను కించపరుస్తూ లేదా అసభ్యంగా చూపించే పోస్టులు పెట్టినా, వీడియోలు చేసినా, వైరల్ చేసినా కఠిన శిక్ష తప్పదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. మొత్తం మీద ఇప్పటివరకు సోషల్ మీడియాను దుర్వినియోగం చేసి రెచ్చిపోయిన వారందరికీ ఇది హెచ్చరికే అని చెప్పాలి. ఇకపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే చట్టం ముందు తలవంచాల్సిందే అన్న సంకేతం స్పష్టంగా వినిపిస్తోంది.