మాజీ మంత్రి శంకరనారాయణకు చేదు అనుభవం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమలో వైసీపీ నేతలకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలంలోని శెట్టిపల్లి, శెట్టిపల్లి తండాల్లో మాజీ మంత్రి శంకరనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిరసన సెగ తగిలింది. ఇంటిముందుకు వచ్చిన శంకరనారాయణను ఓ మహిళ కడిగి పారేసింది. గత 11 నెలలుగా ఫించన్ నిలిపివేశారని శెట్టిపల్లి గ్రామానికి చెందిన లలితాబాబు అనే మహిళ ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్మా బాబు అనే మరో మహిళ తనకు ఇల్లు మంజూరు చేయాలని విన్నవించారు. అదే గ్రామానికి చెందిన మరికొంత మంది మహిళలు తమకు పింఛన్లు మంజూరు చేయాలని కోరారు. తమ సమస్యలు చెప్పేందుకు ప్రయత్నించినా ఎమ్మెల్యే వినకుండా వెళ్లిపోతున్నారని, ప్రజల సమస్యలు వినే ఓపిక లేదా? అని ఓ మహిళ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.













