రెండు నెలలుగా జీతాలు లేక.. వాలంటీర్ వ్యవస్థ మనుగడ ప్రశ్నార్ధకం..
ఆంధ్రాలో కొత్త సర్కార్ ఏర్పాటు జరిగిన తర్వాత జగన్ ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థకు శాశ్వతంగా తెరపడబోతోంది అన్న అనుమానాలు ఎక్కువ అవుతున్నాయి. మరో రెండు రోజుల్లో ఒకటో తారీకు వచ్చేస్తుంది.. సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. అయితే ఎక్కడ వాలంటీర్ల ప్రస్తావన మాత్రం వినిపించడం లేదు. గతంలో జరిగినట్లుగానే సచివాలయం ఉద్యోగస్తులను ఉపయోగించుకొని పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరపడానికి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలకు ముందు వాలంటీర్ల జీతాలను పదివేల రూపాయలు చేస్తామని కూటమి ప్రభుత్వం మాట ఇచ్చింది. అయితే ఈ విషయంపై కొత్త ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. రెండు నెలలుగా వాలంటీర్లకు జీతాలు కూడా రావడం లేదు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల భవిష్యత్తు పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. తమను విధుల్లోకి తీసుకొని రెండు నెలల బకాయిలు వెంటనే ఇవ్వాలని వాలంటీర్లు కోరుతున్నారు. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లు ఉండేవాళ్ళు. వారిలో లక్ష దాకా వైసిపి నేతలు మాటలు విని ఎన్నికలకు ముందు రాజీనామాలు చేశారు. మిగిలిన ఒకటిన్నర లక్ష మంది వాలంటీర్లు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ జీతాలు రెట్టింపు అవుతాయి అన్న ఆశతో ఎదురు చూశారు. ప్రభుత్వం ఏర్పాటై సుమారు రెండు నెలలు కావస్తున్నప్పటికీ ఇంకా వారికి తమ ఉద్యోగాలపై క్లారిటీ మాత్రం రాలేదు. దీంతో వాలంటీర్ల సంఘం రాష్ట్ర నాయకులు తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.
మరోపక్క రాష్ట్ర సర్పంచుల సంఘం వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాదు రాజ్యాంగం ప్రకారం వాలంటీర్ల నియామకం విరుద్ధమని పేర్కొంది. దీంతో వాలంటీర్ వ్యవస్థకు వచ్చాక పెట్టబోతున్నారు అన్న సందేహాలు ఎక్కువవుతున్నాయి. మరోపక్క సచివాలయంలో ఉద్యోగస్తులు పని లేకుండా ఉంటున్నారు.. కాబట్టి వాలంటీర్ల అవసరమేముంది అన్న టాక్ నడుస్తోంది. జీతాలు ఇవ్వాలి అంటే ప్రస్తుతం ఖజానాపై పేను భారం పడుతుంది. ఈ నేపథ్యంలో వాలంటీర్లను ఎలా ఉపయోగించుకోవాలి అనేదానిపై ఏపీ ప్రభుత్వం తర్జనభర్జనలు పడుతుంది.













