YS Viveka Case: వై.ఎస్.వివేకా హత్యకేసుపై మళ్లీ విచారణ ఖాయమా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి (YS Viveka Case) హత్య కేసు విచారణ సుప్రీంకోర్టులో (Supreme Court) కొనసాగుతోంది. 2019 మార్చి 15న కడప జిల్లా పులివెందులలోని తన నివాసంలో వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐ (CBI) రంగంలోకి దిగినప్పటికీ, గత ఆరేళ్లుగా అనేక మలుపులు తిరిగిన ఈ కేసు ఇంకా కొలిక్కి రాలేదు. విచారణ ముగిసిందని సీబీఐ చెప్పడంతో ఈ కేసు క్లోజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. అయితే సునీత (YS Sunitha) జోక్యంతో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 9కి వాయిదా పడింది.
సీబీఐ ఈ కేసులో దర్యాప్తు పూర్తయినట్లు ఆగస్టు 5న సుప్రీం కోర్టుకు తెలిపింది. అయితే, కోర్టు ఆదేశిస్తే తదుపరి విచారణ చేపడతామని సీబీఐ స్పష్టం చేసింది. ఈ కేసులో మూడు కీలక అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని కోర్టు కోరిన నేపథ్యంలో, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కె.ఎస్.ఎన్. రాజు సమయం కోరారు. కడప సెషన్స్ కోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టు, కేసు ట్రయల్‌తో పాటు తదుపరి దర్యాప్తు ఏకకాలంలో కొనసాగించే అవకాశం, ఇతర అంశాలపై సీబీఐ అభిప్రాయాన్ని సుప్రీం కోర్టు కోరింది. ఈ అంశాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని కోర్టు సీబీఐని ఆదేశించింది.
వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, ఈ కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో (YS Avinash Reddy) పాటు ఇతర నిందితుల బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీం కోర్టును కోరారు. సునీత తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. అవినాష్ రెడ్డి ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు. అవినాష్ రెడ్డి ఈ హత్యకు సూత్రధారి అని లూథ్రా వాదించారు. సీబీఐ కూడా ఈ వాదనను సమర్థిస్తూ, నిందితులు సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారని, వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టును కోరింది.
ఈ కేసులో సాక్ష్యాల తారుమారు ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వివేకానంద రెడ్డి మృతదేహాన్ని బాత్‌రూమ్ నుంచి బెడ్‌రూమ్‌కు తరలించి, రక్తపు ఆనవాళ్లను తుడిచేసినట్లు ఆరోపణలు వచ్చాయి. సాక్షులైన కల్లూరు గంగాధర్ రెడ్డి, కటికరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వైఎస్ అభిషేక్ రెడ్డి, ఈసీ గంగిరెడ్డి వంటి వారు అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించడం ఈ కేసును మరింత సంక్లిష్టం చేసింది. ఈ మరణాల వెనుక నిందితుల ప్రమేయం ఉందనే అనుమానాలను సునీతా రెడ్డి వ్యక్తం చేశారు.
ఈ కేసు దర్యాప్తు సందర్భంగా వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు సునీతా రెడ్డి, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్‌పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు. కృష్ణారెడ్డి, సీబీఐ అధికారి రామ్‌సింగ్ తనను హింసించారని, బెదిరించారని ఆరోపించారు. అయితే, ఈ కేసును సుప్రీం కోర్టు క్వాష్ చేసింది. జగన్ ప్రభుత్వ హయాంలో అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఇది సునీత ఫ్యామిలీకి ఊరటనిచ్చే అంశం. అదే సమయంలో వైఎస్ ఫ్యామిలీకి గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు.
వివేకానంద రెడ్డి హత్య జరిగి ఆరేళ్లు గడిచినప్పటికీ న్యాయం జరగలేదని సునీతా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. “నిందితులు యథేచ్ఛగా తిరుగుతుంటే, మా కుటుంబానికి శిక్ష పడుతోంది” అని ఆమె వాపోయారు. సాక్షులపై ఒత్తిళ్లు, బెదిరింపులు జరుగుతున్నాయని, సాక్షుల మరణాలపై అనుమానాలున్నాయని ఆమె ఆరోపించారు. న్యాయం కోసం హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతూ పోరాడుతున్నట్లు సునీత తెలిపారు.
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన అంశంగా కొనసాగుతోంది. సీబీఐ దర్యాప్తు పూర్తయినట్లు ప్రకటించినప్పటికీ, సాక్ష్యాల తారుమారు, సాక్షుల మరణాలు, బెయిల్ రద్దు వంటి అంశాలపై సుప్రీం కోర్టు తీసుకునే నిర్ణయం ఈ కేసు భవిష్యత్తును నిర్దేశిస్తుంది. సెప్టెంబర్ 9న జరిగే తదుపరి విచారణలో సీబీఐ దాఖలు చేసే అఫిడవిట్, నిందితుల బెయిల్ రద్దు పిటిషన్‌పై కోర్టు నిర్ణయం కీలకంగా ఉండనున్నాయి.