చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్తముందా..?
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. ఆయనకు బెయిల్ నిరాకరించి రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడే ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్టుపై టీడీపీ శ్రేణులు మండి పడుతున్నాయి. జగన్ ప్రభుత్వం కుట్ర చేసి చేయని నేరానికి చంద్రబాబును జైలుకు పంపిందని ఆరోపిస్తున్నాయి. అయితే చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కూడా ఉందని అనుమానిస్తున్నారు కొందరు టీడీపీ నేతలు. జగన్, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం అని విమర్శిస్తున్నారు. మరి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ పాత్ర నిజంగా ఉందా..? ఆ పార్టీకి ఏంటి ఉపయోగం..?
40 ఏళ్లు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా పనిచేశారు. రాష్ట్రంలోనే కాకుండా జాతీయ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు. నేషనల్ కాన్ఫరెన్స్, ఎన్డీయే ఏర్పాటులో చంద్రబాబు పాత్ర కూడా కీలకమైనదే. అయితే ఇప్పుడు ఆ కూటములకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కూటముల్లో చేరకుడా తటస్థ పాత్ర పోషిస్తున్నారు. అయితే 2018 వరకూ బీజేపీ కలిసి ప్రయాణించిన చంద్రబాబు 2019 ఎన్నికలకు ముందు ఆ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించి బయటకు వచ్చారు. మోదీపై యుద్ధం ప్రకటించి కాంగ్రెస్ తో చేతులు కలిపారు. ఇది బీజేపీకి ఏమాత్రం నచ్చలేదు.
తమను కాదని వెళ్లిపోయిన చంద్రబాబుపై బీజేపీ కక్షగట్టింది. 2019లో కూడా రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చాక టీడీపీని కనీసం దగ్గరకు కూడా రానివ్వలేదు. చంద్రబాబు ఎన్నిసార్లు అడిగినా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టి చంద్రబాబుపై బీజేపీ పెద్దలు ఏ స్థాయిలో కక్షగట్టారో అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో జగన్ కు మాత్రం అడగ్గానే అపాయింట్మెంట్ ఇస్తున్నారు. జగన్ కు కావాల్సిన అన్ని పనులూ చేసి పెడ్తున్నారు. అయినా టీడీపీ మాత్రం బీజేపీతో స్నేహం కోరుకుంది. బీజేపీ అడగకపోయినా ఆ పార్టీకి అనుగుణంగా మద్దతు ఇస్తూ వచ్చింది. అయినా బీజేపీ నుంచి అస్సలు సపోర్ట్ దొరకలేదు. దీంతో బీజేపీ తమను పూర్తిగా దూరం పెట్టేసిందనే క్లారిటీ టీడీపీకి వచ్చింది.
జగన్ కోరిక మేరకు చంద్రబాబు అరెస్టును బీజేపీ స్వాగతించిందని టీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. రాష్ట్రంలో టీడీపీని బలహీనపర్చడం ద్వారా బీజేపీ బలపడాలనుకుంటోందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును ఎక్కువకాలం జైలులో ఉంచితే టీడీపీ కేడర్ బలహీనపడుతుంది. కేడర్ చెల్లాచెదురైపోతుంది. ఈ బలహీనతను సొమ్ము చేసుకుని కీలకమైన నేతలను తమ పార్టీలోకి తీసుకోవాలనుకుంటున్నట్టు సమాచారం. అందుకే బీజేపీ అధ్యక్షురాలిగా ఎవ్వరూ ఊహించని విధంగా పురంధేశ్వరిని నియమించింది. ఎన్టీఆర్ కుమార్తెగా, చంద్రబాబును వ్యతిరేకించే ఫ్యామిలీగా పురంధేశ్వరి ఉన్నారు. చంద్రబాబుపై పగ తీర్చుకోవడానికి పురంధేశ్వరికి ఇది సదవకాశం. అందుకే వ్యూహాత్మకంగా బీజేపీ ఆమెకు పగ్గాలు అప్పగించింది. అందుకే జగన్ కోరికను మన్నించి చంద్రబాబును బీజేపి జైలుకు పంపిందని టీడీపీ తమ్ముళ్లు ఆరోపిస్తున్నారు. జగన్ జైలుకు పంపినా.. కోర్టుల్లో ప్రతిచోటా ఎదురు దెబ్బలు తగలడం బీజేపీ పనే అనేది తెలుగు తమ్ముళ్ల అనుమానం. అందుకే ఈ ఎపిసోడ్ వెనుక బీజేపీ కీలక పాత్ర పోషించిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.













