ఏపీ నిర్ణయమే కరెక్ట్.. ఆర్బీఐ నివేదిక ఇదే చెబుతోందా..?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రభుత్వోద్యోగులకు మధ్య కొంతకాలంగా సీపీఎస్ రద్దు విషయంలో వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్ విధానాన్ని అమలుచేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతుంటే, అది సాధ్యం కాదని, దానివల్ల భవిష్యత్తులో రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం వివరించే ప్రయత్నంచేస్తోంది. ఉద్యోగుల ఆందోళనలతో ఓ మెట్టు దిగి మరీ సీపీఎస్ బదులు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పింది. కానీ ఉద్యోగ సంఘాలు మాత్రం అందుకు అంగీకరించకుండా ఉద్యమాలను కొనసాగిస్తూనే ఉన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు అంగీకరించినప్పుడు ఏపీలో ఎందుకు సాధ్యం కాదంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ఆర్బీఐ చేసిన ప్రకటన ఏపీ నిర్ణయాన్ని సమర్థించేలా ఉండడం ఇప్పుడు సంచలనంగా మారింది. పాత పింఛను పథకాన్ని(OPS) పునరుద్ధరించబోతున్న రాష్ట్రాలన్నీ భవిష్యత్తులో విపరీతమైన ఆర్థిక భారం భరించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ‘నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS) స్థానంలో ఓపీఎస్‌ను ఎంచుకోవడం వల్ల రానున్న సంవత్సరాల్లో అప్పులు విపరీతంగా పెరుగుతాయి. ఈ పెన్షన్ స్కీంలో డబ్బు కొంత కాలం మాత్రమే ఉంటుంది. ప్రస్తుత ఖర్చులను వాయిదా వేయడంతో రాబోయే సంవత్సరాల్లో పెన్షన్ అప్పులు ప్రభుత్వాలు తీర్చలేని స్థాయికి చేరుకుంటాయి.’ అని తాజాగా విడుదల చేసిన నివేదిక ద్వారా ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం.. 2022-23 బడ్జెట్ అంచనాల ప్రకారం అప్పట్లో ఉద్యోగుల పెన్షన్ కోసం చేసిన ఖర్చు రూ.399,813 కోట్లు. అది ఇప్పుడు రూ.4,63,436 కోట్లకు పెరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వాల ఖర్చు 16 శాతం పెరిగిందన్నమాట. 2022తో పోలిస్తే చివరి 12 ఏళ్లలో రాష్ట్రాల పింఛను భారం ఏటా 34 శాతం చొప్పున పెరగడడం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.
ఓపీఎస్‌లో సమస్యేంటి?
పాత పింఛను పథకంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులు తమ చివరి జీతంలో 50 శాతాన్ని ప్రతి నెలా పింఛనుగా పొందుతారు. నిజానికి ఈ విధానం ఆర్థికంగా మోయగలిగేది కాదు. ఈ పథకానికి డబ్బు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల వద్ద ఎలాంటి నిధులు ఉండవు. అప్పటికే కూడబెట్టిన నిధులు లేదా స్టాక్ మార్కెట్లో మదుపు చేసిన సొమ్ము ఉండదు. దాంతో ఈ పెన్షన్ చెల్లింపులు ఆర్థిక భారంగా మారుతుంది. కానీ రాజకీయ పార్టీలకు మాత్రం ఇదే ముద్దుగా మారిందని ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్ట్ తెలిపింది. రిటైర్మెంట్ పొందిన ఉద్యోగుల కోసం ప్రస్తుత పన్ను చెల్లింపు దారుల డబ్బు చెల్లించాల్సి వస్తుందని, అది ప్రభుత్వాలతో పాటు ప్రజలపై కూడా విపరీతమైన ఆర్థిక భారాన్ని పెంచుతుందని హెచ్చరించింది.













