సీనియర్లను చంద్రబాబు ఎందుకు పక్కన పెట్టారు..?
ఆంధ్రప్రదేశ్ లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది. నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలోకి 24 మందిని తీసుకున్నారు. ఇందులో ఎక్కువ మంది కొత్తవాళ్లే. గతంలో సీనియారిటీకి ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు ఈసారి మాత్రం పూర్తి భిన్నంగా యువతరానికి పెద్దపీట వేశారు. సీనియర్లను పక్కన పెట్టారు. ఇది పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అసలు సీనియర్లను ఎందుకు పక్కన పెట్టారు? వాళ్లకు ఎలా సర్ది చెప్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ సాక్షిగా ఆయన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేశారు. మొత్తం 24 మందిలో 17 మంతి తొలిసారి మంత్రులు కావడం విశేషం. కేవలం ఏడుగురికి మాత్రమే గతంలో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉంది. మంత్రివర్గంలో యువతరానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది.
సీనియర్లను చంద్రబాబు పక్కన పెట్టడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అన్నీ తామై నడిపించిన సీనియర్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లంతా మంత్రివర్గంలో చోటు ఆశించారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేబినెట్ ను ఏర్పాటు చేసుకున్నారు చంద్రబాబు. కళా వెంకట్రావు, అయ్యన్నపాత్రుడు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణ మూర్తి, యనమల రామకృష్ణుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పితాని సత్యనారాయణ, రఘురామ కృష్ణంరాజు, బోండా ఉమామహేశ్వర రావు, గద్దె రామ్మోహన్, ధూళిపాళ్ల నరేంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, ఏలూరి సాంబశివరావు, దామచర్ల జనార్ధన్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, అమరనాథ్ రెడ్డి, సుజనా చౌదరి లాంటి ఎంతోమంది సీనియర్లు చోటు ఆశించారు.
సీనియర్లను చంద్రబాబు ఎందుకు పక్కన పెట్టారనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే చంద్రబాబు ఆలోచన మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ఆశావహులు భారీగా ఉండడం, అందులోనూ సీనియర్లు అత్యధికంగా ఉండడంతో ఒకరికి ఇచ్చి మరొకరికి ఇవ్వకపోతే ఇబ్బంది ఎదురవుతుందని చంద్రబాబు ఆలోచించినట్లు సమాచారం. అందుకే సీనియర్లందరినీ పక్కన పెట్టి యువతకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. తద్వారా అలకలకు చెక్ పెట్టినట్టు అర్థమవుతోంది.
కేబినెట్లో యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని గతంలో యనమల రామకృష్ణుడు లాంటి కొంతమంది సీనియర్లు చంద్రబాబుకు సూచించారు. పైగా భవిష్యత్ యువతరానిదేనని లోకేశ్ నేతృత్వంలో పార్టీకోసం పని చేయాల్సి ఉంటుందని పార్టీ హైకమాండ్ ఆలోచించింది. అందుకు తగ్గట్టే యువతరానికి పెద్ద పీట వేసి లోకేశ్ నేతృత్వంలో పనిచేసేలా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. రెండోతరాన్ని సిద్ధం చేయడం ద్వారా పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకున్నట్టు అర్థమవుతోంది.













