Chandra Babu: బాబు తరవాత ఎవరు? కూటమిలో భవిష్యత్తు నాయకత్వం ఆ ఇద్దరిలో ఎవరిది?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) కూటమి పాలన కొనసాగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఈ కూటమికి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) నాయకత్వం వహిస్తున్నారు. ఆయన అనుభవం, రాజకీయ పరిజ్ఞానం కూటమికి దిశానిర్దేశం చేస్తోంది. ముఖ్యమంత్రి పదవిలో ఆయన ఉండటంపై కూటమిలో ఎలాంటి అభ్యంతరాలు లేవు. అందరూ ఏకగ్రీవంగా ఆయన నాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి (Deputy CM) పదవిలో ఉన్న జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పటికే పలుమార్లు బహిరంగంగా చంద్రబాబు నాయకత్వం భవిష్యత్తులో కూడా కొనసాగాలని అభిలషిస్తున్నారు.
నారా లోకేష్ (Nara Lokesh) విషయానికి వస్తే, ఆయన తన తండ్రి చంద్రబాబుతో పాటు పార్టీ విషయాలు, ప్రభుత్వ పరిపాలన రెండింటినీ సమాంతరంగా చూసేలా ముందుకు సాగుతున్నారు. చంద్రబాబు ఉన్నంత కాలం పాటు ఆయనకు తోడుగా ఉంటారు అన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే భవిష్యత్తులో చంద్రబాబు తరువాత కూటమి నాయకత్వం ఎవరికి ఇస్తారు అన్నది రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చగా మారుతోంది. ఇది ఇప్పటికిప్పుడు తేల్చాల్సిన విషయం కాకపోయినా, రాజకీయ విశ్లేషణలలో మాత్రం ఇది ప్రాధాన్యం పొందుతోంది.
భవిష్యత్తు నాయకత్వంపై పార్టీలకీ వేర్వేరు అభిప్రాయాలు కనిపిస్తుంటే సోషల్ మీడియాలో ఈ విషయంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయాలలో పవన్ కు ఉన్న సినీ గ్లామర్, విశేషమైన ఫాలోయింగ్, ప్రజలతో నేరుగా కలవడం వంటి అంశాల వల్ల ఆయనకి ఎక్కువ స్పందన లభిస్తోంది. జనసేన పార్టీకి ఆయన చేసిన కృషి, వెనుక ఉన్న సామాజిక వర్గం బలంగా ఉండటంతో ఆయనకి ప్రత్యేక స్థానం ఏర్పడింది.
ఇదే సమయంలో లోకేష్ కూడా సమర్థుడే. ఆయనకి టీడీపీ(TDP ) అనే బలమైన మద్దతు ఉంది. 2019 ఎన్నికలతో పోల్చుకుంటే 2024 ఎన్నికల సమయానికి లోకేష్ తన మార్కు రాజకీయం ఎలా ఉంటుందో ప్రజలకు పరిచయం చేసి వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా గోరంట్లలో జరిగిన ఒక నాయకుడి అంత్యక్రియలకు పవన్, లోకేష్ ఇద్దరూ హాజరయ్యారు. కానీ అక్కడ జనం దృష్టి పూర్తిగా పవన్ పైకి మళ్లింది. మీడియా ఫోకస్ కూడా అదే దిశగా సాగింది. నిజానికి ముందుగా వచ్చి పాల్గొన్నది లోకేష్ అయినా, పవన్ వచ్చిన తరువాత మొత్తం దృశ్యం మారిపోయింది.
ఇలాంటి సందర్భాలలో ప్రజల స్పందన చూస్తే పవన్ మాస్ లీడర్‌గా ఎంత బలంగా ఉన్నారో అర్థమవుతుంది. అయితే లోకేష్ కూడా తన హోదాను మెరుగుపర్చేందుకు స్పష్టమైన వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ప్రజల దృష్టిలోకి రావాలంటే గ్లామర్ తో పాటు ప్రజలతో చొరవగా మమేకం కావాల్సిన అవసరం ఉంది. పవన్, లోకేష్ కలిసి పాల్గొంటున్న వేళల్లో ఈ తేడాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి..