వైసీపీలో నెంబర్ వన్ ఎవరు..? జగనా… సజ్జలా…??
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శివకుమార్. అయితే ఆ పార్టీని వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సొంతం చేసుకున్నారు. 2011 మార్చిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. పార్టీలో ఆయనే ఫైనల్. ఆయన తర్వాతే ఎవరైనా. 13 ఏళ్ల వయసున్న ఈ పార్టీ ఐదేళ్లపాటు అధికారంలో ఉంది. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయింది. ప్రాంతీయ పార్టీ కాబట్టి వ్యక్తుల ఇష్టాయిష్టాల మీదనే నడుస్తుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇందుకు అతీతం కాదు. అయితే పార్టీలో జగన్ కాకుండా ఇతరుల ప్రమేయం అధికమైందనే టాక్ ఇటీవల ఎక్కువగా వినిపిస్తోంది.
2024 ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఓటమికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెప్తున్నారు. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్లు విశ్లేషిస్తున్నారు. పార్టీ అధిష్టానానికి, కేడర్ కు మధ్య దూరం పెరిగిపోవడం వల్లే ఓడిపోయిందని కొందరు చెప్తున్నారు. వాలంటీర్లను నమ్ముకుని కార్యకర్తలను వదిలేయడం వల్లే ఓడిపోయామని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా సజ్జల రామకృష్ణారెడ్డి అతి జోక్యం వల్లే పార్టీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నేరుగా విమర్శిస్తున్నారు. ఇటీవల వైసీపీ సొంత ఛానల్ సాక్షిలో ఆ పార్టీ అధికార ప్రతినిధి కె.రవిచంద్రా రెడ్డి నేరుగా సజ్జలను టార్గెట్ చేశారు. సజ్జల వల్లే పార్టీ ఓడిపోయిందన్నారు.
సొంత పార్టీ నేతలే సజ్జల వల్ల పార్టీ ఓడిపోయిందని మాట్లాడుతుండడంతో ఒక రకమైన ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. అసలే పార్టీ ఓడిపోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో ఇలాంటి మాటలు సహజంగానే అందరిని బాధపడతాయి. అయితే వాళ్లు మాట్లాడే దాంట్లో వాస్తవం ఉంది కదా అని భావించే వాళ్ల కూడా ఉన్నారు. పార్టీలో మంచి చెడులు చెప్పడం తప్పు కాదని అలాంటి వాళ్ళను ఇబ్బంది పెట్టడం మంచిది కాదని కొందరు ఇస్తున్నారు. అయితే వైసీపీలో మాత్రం దీనికి వ్యతిరేకంగా వ్యవహారాలు నడుస్తున్నాయి. పార్టీ శ్రేణులను ఇది ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్ట్రానిక్ మీడియాకు పార్టీ అధికార ప్రతినిధుల జాబితాను పంపిణీ చేసింది. ఇందులో సూచించిన 14 మందిని చర్చలకు ఆహ్వానించాలని మిగిలిన వారిని పిలవద్దని కోరింది. అయితే ఈ జాబితాలో కే రవిచంద్రారెడ్డి పేరు లేకపోవడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఎప్పటినుంచో పార్టీలో ఉంటూ పార్టీ వాయిస్‌ను బలంగా మీడియాలో వినిపిస్తూ వచ్చిన కే రవిచంద్ర రెడ్డి ఇప్పుడు పార్టీకి సేవలు అవసరం లేదని పరోక్షంగా చెప్పినట్లు అయింది. అయితే రవిచంద్ర రెడ్డి సజ్జలను విమర్శించడం వల్లే ఆయన పేరు పార్టీ ప్రతినిధులు జాబితాలో లేకుండా పోయిందని కొందరు చెప్పుకుంటున్నారు. దీన్నిబట్టి పార్టీలో జగన్ కంటే సజ్జలకే ఎక్కువ ప్రయారిటీ ఉందని అర్థమవుతుందని కొంతమంది నేతలు గుసగుసలాడుకుంటున్నారు.













