Kasireddy Rajasekhar Reddy: ఎవరీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి..??
కాకినాడ సెజ్, పోర్టును అక్రమంగా లాగేసుకున్నారనే ఆరోపణలపై ఏపీ సీఐడీ విచారణ (CID) జరుపుతోంది. ఇందులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijaya Sai Reddy) సీఐడీ ఎదుట హాజరై తన వాదన వినిపించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి రెడ్డి పలు అంశాలపై స్పందించారు. ఈ సందర్భంగా లిక్కర్ స్కాంలో కర్త, కర్మ, క్రియ కసిరెడ్డి రాజశేఖర రెడ్డే (Kasireddy Rajasekhar Reddy) అని తేల్చి చెప్పారు. దీంతో ఎవరీ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి.. అని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు. వాస్తవానికి వైసీపీ (YCP) శ్రేణులకు కూడా ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గురించి పెద్దగా తెలీదు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ పాలసీలో పెద్ద కుంభకోణం (Liquor Scam) జరిగిందని.. వేల కోట్ల రూపాయలను వైసీపీ నేతలు దోచుకున్నారని టీడీపీ (TDP) ఆరోపించింది. తాము అధికారంలోకి వస్తే లిక్కర్ స్కాంపై విచారణ జరిపిస్తామని అప్పట్లో ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లిక్కర్ లావాదేవీల్లో చోటుచేసుకున్న అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. ఇందులో వైసీపీ అగ్రనేతల పాత్ర ఉన్నట్టు గుర్తించింది. ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy), అప్పటి ఏపీబీసీఎల్ (APDCL) ఎండీ వాసుదేవ రెడ్డి (Vasudeva Reddy) కీలకపాత్ర పోషించినట్లు భావిస్తోంది. వీళ్లకు ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది.
అయితే ఇప్పుడు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పేరును విజయసాయి రెడ్డి బయటపెట్టడంతో అందరి చూపూ అటువైపు మళ్లింది. కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అందరూ రాజ్ కసిరెడ్డి (Raj Kasireddy) అని పిలుస్తూ ఉంటారు. ఆయన్ను జగన్ ఐటీ సలహాదారుగా నియమించుకున్నారు. విదేశాల్లో ఆయనకు పలు వ్యాపారాలు ఉన్నాయని సమాచారం. ముఖ్యంగా లిక్కర్ కంపెనీలు ఉన్నాయని తెలుస్తోంది. ఆ అనుభవంతో జగన్ కు బాగా దగ్గరయ్యాయని, లిక్కర్ స్కాంలో కీలకపాత్ర పోషించారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డే అన్నీ తానై వ్యవహరించారని చెప్పారు.
జగన్ హయాంలో భారీ ఎత్తున లిక్కర్ స్కాం జరిగిందనే ఆరోపణలు కొత్తకాదు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వం ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేశారు. అనుమతులు లేకుండానే కొన్ని బ్రాండ్ల మద్యాన్ని అమ్మారు. బ్రాండెడ్ మద్యం అందుబాటులో లేకుండా చేసి తాము అమ్మాలనుకున్న బ్రాండ్లను మాత్రమే సేల్ చేశారు. అది కూడా డిజిటల్ లావాదేవీలు లేకుండా కేవలం క్యాష్ రూపంలోనే లావాదేవీలు నడిపారు. దీని వెనుక వేలకోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి పడిందని., ఆ సొమ్మంతా వైసీపీ నేతలకు వెళ్లిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఇటీవల మద్యం కుంభకోణంలో రూ.3వేల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు గుర్తించామని టీడీపీ తమ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. ఇన్నాళ్లూ అసలు లిక్కర్ స్కామే జరగలేదని వైసీపీ చెప్తూ వచ్చింది. కానీ ఇప్పుడు విజయసాయి రెడ్డి బాంబ్ పేల్చారు.













