అజ్ఞాతంలోకి వెళ్లపోయిన అచ్చెన్నాయుడు..!?
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఐడీ అరెస్టు చేసింది. నంద్యాలలో ఆయన్ను అదుపులోకి తీసుకున్న సీఐడీ పోలీసులు విజయవాడ తరలించి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. చంద్రబాబు అరెస్టుతో టీడీపీ శ్రేణులు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టాయి. పలుచోట్ల టీడీపీ శ్రేణులను బస్సులను అడ్డుకున్నాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నేతలందరూ విజయవాడ పయనమయ్యారు. తదుపరి కార్యాచరణపై చర్చలు జరుపుతున్నారు. అయితే రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాత్రం ఎక్కడా కనిపించలేదు.
చంద్రబాబు అరెస్ట్ అయితే వాస్తవానికి ముందుండాల్సింది ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. ఏ చిన్న సంఘటన జరిగినా అచ్చెన్నాయుడు వాలిపోతుంటారు. కానీ ఇప్పుడు సాక్షాత్తూ పార్టీ అధినేతే అరెస్ట్ అయినా ఆయన ఆచూకీ మాత్రం కనిపించడం లేదు. ఆయన ఎక్కడా మీడియా ముందుకు రాలేదు. రేపు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్షలు చేపట్టాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిస్తూ ఒక ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేశారు. దీనికి కారణం ఈ కేసులో రెండో ముద్దాయిగా అచ్చెన్నాయుడు పేరు ఉండడమే అని తెలుస్తోంది. చంద్రబాబును అరెస్టు చేయడంతో తదుపరి అరెస్టు అచ్చెన్నాయుడిదేననే ప్రచారం జోరుగా సాగుతోంది.
స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్మిక శాఖ పరిధిలో ఏర్పాటైంది. ఈ కార్పొరేషన్ ఏర్పాటై నిధుల బదలాయింపు జరిగినప్పుడు కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడే ఉండేవారు. అందుకే ఈ కేసులో ఏ1గా చంద్రబాబును, ఏ2గా అచ్చెన్నాయుడిని చేర్చింది సీఐడీ. కార్మిక శాఖ ప్రమేయం లేకుండా నిధుల బదలాయింపు జరగదు. కార్పొరేషన్ లో ఏం జరిగినా దానికి సంబంధిత శాఖే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకే అచ్చెన్నాయుడు అరెస్టు కూడా ఉంటుందని తెలుస్తోంది.
ఇప్పటికే అచ్చెన్నాయుడు ఈఎస్ఐ కుంభకోణం కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. అప్పట్లో అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఇప్పుడు మరోసారి అచ్చెన్నాయుడు అరెస్ట్ తప్పకపోవచ్చనే ప్రచారం జరుగుతోంది. అందుకే అచ్చెన్నాయుడు బయటకు రాలేదని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఎక్కడ ఉన్నారనేది తెలియట్లేదు. ఆయన నివాసాల వద్ద కూడా ఎలాంటి హడావుడి లేదు. కాబట్టి చంద్రబాబు వ్యవహారం సద్దుమణిగిన తర్వాత అచ్చెన్నాయుడు అరెస్టు ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది.













