Vasireddy Padma: టీడీపీ, జనసేన..ఇక నెక్స్ట్ వాసిరెడ్డి పద్మ టార్గెట్ ఏమిటో?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వాతావరణం మారుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాజకీయాల్లో కొత్త కదలికలు కనిపిస్తున్నాయి. అటు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మధ్య వ్యూహాత్మక పోటీ మొదలైంది. వలసల విషయంలో గతం కంటే వేగం తగ్గినా, కొత్తగా పార్టీల్లోకి ఎవరు చేరతారనే ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో చర్చల్లోకి వచ్చిన పేరు వాసిరెడ్డి పద్మ (Vasireddy Padma). గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి (YSRCP) అనుకూలంగా ,బలంగా నిలిచిన పద్మ, ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పక్కన బలమైన వాయిస్‌గా గుర్తింపు పొందారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను మహిళా కమిషన్ ఛైర్ పర్సన్‌గా నియమించారు. అయితే 2024 ఎన్నికల్లో జగన్ నేతృత్వంలో పార్టీ ఓడిపోయిన తరువాత పద్మ వైసీపీపై (YCP) విమర్శలు గుప్పిస్తూ బయటకు వచ్చారు.
తొలుత పద్మ జనసేన (JanaSena)లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరిగింది. అయితే సామినేని ఉదయభాను (Samineni Udayabhanu) పార్టీలోకి రావడంతో పద్మకు అక్కడి నుంచి అవకాశాలు తగ్గిపోయాయి. ఆపై ఆమె తెలుగుదేశం పార్టీలోకి (TDP) వెళ్లేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ఇదే విషయం పై ఆమె విజయవాడ (Vijayawada) ఎంపీ కేశినేని చిన్ని (Kesineni Chinni)తో సంప్రదింపులు కూడా జరిపినట్లు టాక్. లోకేష్ (Lokesh) ఈ విషయంపై సానుకూలంగా స్పందించినా, సీఎం చంద్రబాబు మాత్రం ఈ నిర్ణయంపై స్పష్టత ఇవ్వలేదు.
అందుకు కారణంగా ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల అభిప్రాయం వ్యతిరేకంగా రావడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో టీడీపీ గేట్లు కూడా పద్మకు మూసివేయబడ్డాయి. ఇప్పుడు ఆమె భవితవ్యంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీజేపీ (BJP)లోకి వెళ్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆమె ఆ పార్టీలో చేరితే అక్కడ ఆమెకు ఎలాంటి స్థానం దక్కుతుందో అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇలా చూస్తే పద్మకు ప్రస్తుతం జనసేన, టీడీపీ మార్గాలు క్లియర్ కాకపోవటంతో, ఆమె తీసుకోబోయే తదుపరి రాజకీయ నిర్ణయం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రాజకీయంగా ఆమె ఎటు వైపు అడుగు వేస్తారో వేచి చూడాల్సిందే.