Alla Nani: టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఆళ్ళ నాని..మరి వెయిటింగ్లో ఉన్న నేతల పరిస్థితి ఏమిటో?
2024 ఎన్నికల తర్వాత ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. టీడీపీలో చేరేందుకు చాలా మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని టాక్ నడుస్తోంది. పార్టీ మళ్లీ అధికారంలో ఉండటం, ఇంకా నాలుగేళ్లకు పైగా గడవాల్సి ఉండటంతో, చాలామంది రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీడీపీ( TDP) వైపు చూస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉండటం వల్ల మరిన్ని అవకాశాలు లభిస్తాయని, 2029లో టికెట్ దక్కించుకుని మరింత రాజకీయంగా ఎదగవచ్చనే ఆశతో నేతలు సిద్ధమవుతున్నారు. దీంతో టీడీపీ వైపుగా ఆకర్షితులయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే వైసీపీని (YCP) వదిలి వెళ్లేందుకు కారణాలు వెతుక్కుంటున్న వారు ఉన్నారు. అలాగే పార్టీలోని పరిస్థితులు బాగోలేక బయటకు వచ్చి ఎదురుచూస్తున్నవారూ లేకపోలేదు.
ఉత్తరాంధ్రలోని భీమిలీ నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు (Avanthi Srinivas) కొద్దినెలల క్రితం వైసీపీకి (YCP) రాజీనామా చేశారు. అప్పట్లో ఆయన ఏ పార్టీకి వెళ్లాలనే విషయం చెప్పకపోయినా, టీడీపీలో చేరాలని అనుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన భీమిలీ (Bhimili ) టికెట్ ఆశిస్తున్నారు. అయితే అక్కడ ఇప్పటికే గంటా శ్రీనివాసరావు ( Ganta Srinivas) ఉన్నారు, గతంలో అవంతికి రాజకీయంగా మార్గదర్శకుడిగా వ్యవహరించిన ఆయన, ఇప్పుడు అవంతి రాకకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెబుతున్నారు. ఈ కారణంగా ఆయన చేరిక ఆలస్యమవుతోందని ప్రచారం ఉంది. కానీ మరోవైపు గోదావరి జిల్లాలకు చెందిన మాజీ మంత్రి ఆళ్ళ నానిని (Alla Nani)చంద్రబాబు స్వయంగా పిలిచి పార్టీలో చేర్చుకోవడం, ఇతర నేతలకు స్ఫూర్తిగా మారిందని అంటున్నారు.
ఏలూరు జిల్లాలో ఆళ్ళ చేరికపై అభ్యంతరాలు ఉన్నా, స్థానిక నేతలను ఒప్పించి చంద్రబాబు ఆయనకు పసుపు కండువా కప్పారు. ఇదే విధంగా ఇతర ప్రాంతాల్లోనూ పార్టీ అధినాయకత్వం అడుగులు వేస్తే, వెయిటింగ్లో ఉన్న పలువురు నేతలు టీడీపీలో చేరవచ్చని భావిస్తున్నారు. అవంతి వంటి నాయకుడు ఎంపీగా కూడా పని చేసిన అనుభవం కలిగి ఉండటంతో, ఆయన చేరిక కూడా త్వరలోనే జరుగుతుందని చెబుతున్నారు. ఇక ఉత్తరాంధ్రలో మరో సీనియర్ నేత కూడా తన కుమారుడి భవిష్యత్తు కోసం టీడీపీ వైపు చూస్తున్నట్లు ప్రచారం ఉంది. ఆయన ప్రస్తుతం తన పార్టీలో సైలెంట్‌గానే ఉన్నా, కార్యాచరణ లేకపోవడం వల్ల అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు. తన వారసుడికి రాజకీయ భవిష్యత్తు బలంగా ఉండాలనుకుంటున్న ఆయన, టీడీపీదే సరైన ఆప్షన్ అని భావిస్తున్నారని తెలుస్తోంది. కానీ ఆయన చేరికకు జిల్లాలోని పెద్దల అభ్యంతరాలు ఓ అవరోధంగా మారుతున్నట్లు చెబుతున్నారు. అయినప్పటికీ, పార్టీకి లాభమైతే, ఆయన చేరికకు కూడా గ్రీన్ సిగ్నల్ రావొచ్చని అంటున్నారు.
అలాగే గత ప్రభుత్వంలో ఉన్నత పదవులు చేపట్టి ఇప్పుడు మౌనంగా ఉన్న మరో నేత కూడా టీడీపీ వైపు చూస్తున్నారని సమాచారం. విశాఖ జిల్లాలో ఇప్పటికే అరడజను మంది మాజీ ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో టీడీపీలో కీలకమైన పదవులు నిర్వహించిన ఓ మైనారిటీ నేత, వైసీపీలో చేరినా, తిరిగి టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు. అలాగే కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ ఇలా మారిపోతూ చివరకు వైసీపీ నేతలుగా ఉన్న కొందరు కూడా తిరిగి టీడీపీలోకి రావాలని చూస్తున్నట్లు టాక్. ఆళ్ళ నాని చేరికతో ఈ మార్పులన్నీ మరింత వేగం పుంజుకునే అవకాశముందని, త్వరలోనే మరికొంతమంది నేతలు టీడీపీ తీర్థం పుచ్చుకోవచ్చని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న పేర్లతో పాటు ఎవరూ ఊహించని కొత్త నేతల పేర్లు కూడా బయటకు రావచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు చేరుతున్న కొత్త నాయకుల కారణంగా ఆల్రెడీ పార్టీని నమ్ముకున్న సీనియర్ల పరిస్థితి ఏమిటి అన్న విషయం హాట్ టాపిక్ గా మారింది.













