Grama Ward Sachivalayam: సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తు పై కూటమి నిర్ణయం ఏమిటో?
గ్రామ, వార్డు సచివాలయ (grama ward sachivalayam) ఉద్యోగుల భవిష్యత్తు పై నెలకొన్న అనిశ్చితి గత కొంతకాలంగా కొనసాగుతోంది. వైసీపీ (YCP) హయాంలో లక్షా పాతిక వేల మందికి ఉద్యోగాలు కల్పించినప్పటికీ, వారు పూర్తిస్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కాలేకపోయారు. కాంట్రాక్టు ఉద్యోగులకంటే మెరుగైన స్థితిలో ఉన్నప్పటికీ, ప్రభుత్వ విధుల్లో నేరుగా ప్రవేశించే అవకాశం లేకపోవడం వారిని అయోమయానికి గురిచేసింది. పైగా ఇప్పుడు వీరి ఉద్యోగాల గురించి చంద్రబాబు (Chandra Babu) ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది.
సచివాలయ ఉద్యోగులను ఒక వ్యవస్థగా రూపొందించలేకపోయారని పలువురు విమర్శలు చేశారు. గత ప్రభుత్వం ఉద్యోగులను అవసరానికి మించి నియమించడంతో పాటు, వారిని ప్రధానంగా ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికే వినియోగించినట్లు చెబుతున్నారు. దీని వల్ల ఉద్యోగాల భద్రత లేకపోవడంతో పాటు, ఉద్యోగాల్లో ఎదుగుదల కూడా లేకుండా పోయింది. ఈ కారణాల వల్లనే 2024 ఎన్నికల్లో వీరికి ఉద్యోగాలు ఇచ్చిన పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసి, కూటమిని గెలిపించేందుకు మద్దతిచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తమకు స్థిరత్వం లభిస్తుందని ఆశించినప్పటికీ, ఎనిమిది నెలలు గడిచినా సచివాలయ ఉద్యోగుల భవిష్యత్తుపై ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేకపోయింది. అయితే ఇటీవల ప్రభుత్వం ఈ ఉద్యోగులను మూడు విభాగాలుగా విభజించి, అవసరమైన చోట్ల నియమించేందుకు చర్యలు ప్రారంభించింది. అదనంగా మిగిలిన నలభై వేల మంది ఉద్యోగుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరలోనే గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను అధికారుల ముందుకు తీసుకెళ్లనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగ సర్వీసులో తమను కలిపి, పూర్తి స్థాయి ఉద్యోగ భద్రత కల్పించాలని, అదనపు పనిభారం లేకుండా చూడాలని వారు కోరుతున్నారు. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆర్థికంగా క్లిష్ట స్థితిలో ఉందని, అందుకే మిగిలిన సిబ్బందిని ఖాళీగా ఉన్న ఇతర ప్రభుత్వ శాఖల్లో వినియోగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వం లక్షా పాతిక వేల మంది సిబ్బందిలో 75 వేలకు తగ్గించి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియమించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యోగుల పనితీరు ఆధారంగా గ్రేడింగ్ విధానం అమలు చేసి, తగిన విధంగా బదిలీలు, ప్రమోషన్లు అందించేందుకు అవకాశం కల్పించవచ్చని చెబుతున్నారు. మరోవైపు, ఉద్యోగ సంఘాలు తమ హక్కుల కోసం పెద్ద డిమాండ్లతో మంత్రిని కలవనున్నాయి. మంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ప్రభుత్వం సచివాలయ వ్యవస్థపై ఏ మార్పులు తీసుకురానుందో త్వరలో స్పష్టత రానుంది.













