టీడీపీ నేతలకు ఏమైంది…? ఎందుకీ మౌనం, అనుకూలంగా ఉన్నా వాడుకోలేకపోతున్నారా…?
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి కేసుకి సంబంధించి కాస్త సంచలనమే నడుస్తుంది. దీని కారణంగా అధికార పార్టీ ఎంత ఇబ్బంది పడింది ఏంటీ అనేది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ నేతలు మాత్రం దీనిపై సైలెంట్ గా ఉండటం ఆ పార్టీ కార్యకర్తలను ఆశ్చర్యపరిచే అంశంగా చెప్పాలి. చాలా మంది టీడీపీ నేతలు ఈ విషయంలో అసలు ఒక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. రాయాలసీమ జిల్లాలకు చెందిన నేతలు ఎవరూ కూడా దీనిపై మాట్లాడటానికి సిద్దంగా లేరనేది అర్ధమవుతుంది.
కొందరు అగ్ర నేతలు కూడా సైలెంట్ గానే ఉండటం ఆశ్చర్యపరిచే విషయం. మాట్లాడితే చంద్రబాబు నాయుడు లేదా వర్ల రామయ్య అప్పుడప్పుడు దేవినేని ఉమా మినహా పెద్దగా ఇతర నేతలు ఎవరూ మాట్లాడటం లేదు. కడప జిల్లాకు చెందిన నాయకులు ఎవరూ కూడా దీనిపై మాట్లాడేందుకు సిద్దంగా లేరనేది అర్ధమవుతుంది. అప్పుడప్పుడు బీటెక్ రవి ఒక్కరే మాట్లాడుతున్నారు. ఇక ఆయనకు భద్రత తొలగించినా సరే పెద్దగా స్పందన కనపడటం లేదు పార్టీ నేతల నుంచి. దీనిపై పార్టీ అధిష్టానం కూడా ఇబ్బందిగానే ఉంది.
ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడటం లేదంటూ సోషల్ మీడియాలో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారు. ఇక మాజీ మంత్రులు, చంద్రబాబు సన్నిహిత నేతలు, కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు ఎవరూ కూడా స్పందించే ప్రయత్నం చేయడం లేదు. టీడీపీ అనుకూల మీడియా కారణంగానే దీనికి సంబంధించి కాస్త హడావుడి జరుగుతుంది గాని పెద్దగా మిగిలిన నాయకులు ఎవరూ ఆసక్తిగా కనపడటం లేదు. భాస్కర రెడ్డి ని అరెస్ట్ చేసిన రోజు కూడా టీడీపీ అనుకూల మీడియా హడావుడి మినహా ఎవరి నుంచి స్పందన లేదు అనే చెప్పాలి.
ఈ ఒక్కటే కాదు చాలా విషయాల్లో టీడీపీ నేతల వైఖరి ఇలాగే ఉంది. జగన్ పై విశాఖ విమానాశ్రయంలో జరిగిన దాడి ఘటన విషయంలో టీడీపీ అనుకూలంగా జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటన ఉన్నా సరే దానిపై కూడా టీడీపీ నేతల నుంచి స్పందన లేదనే చెప్పాలి. ఈ తరహా వైఖరి తో అనవసరంగా కార్యకర్తలు కూడా ఇబ్బంది పడతారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.













