ఏపీలో సంక్షేమ సునామీ సృష్టించాం…
దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనంతటి అభివృద్ధిని సాధించాం… రాష్ట్ర ఆదాయాన్ని పెంచాం… ప్రజల జీవనస్థితిగతులను మెరుగుపరిచాం…. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇబ్బడిముబ్బడిగా కల్పించాం… రాష్ట్రంలోని ప్రతి వర్గానికి న్యాయం జరిగేట్లు చర్యలు తీసుకున్నాం… అనాధలు అంటూ బాధ పడేస్థితి లేకుండా అందరిని కాపుకాసాం… ప్రతి ఒక్కరికీ జీవనోపాధి కల్పించాం… గతంలో సంపాదిస్తున్న ఆదాయాన్ని అధికం చేశాం… ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనకబడిన వర్గాలకు తోడ్పాటునందించాం… నాలుగున్నరేళ్ళలో 3.5 లక్షల కోట్లతో సంక్షేమ కార్యక్రమాల అమలుతో ‘ సంక్షేమ సునామీ’ సృష్టించగలిగాం… ఈ సునామీ దెబ్బతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని ప్రతిపక్షం వైకపాకు ఊపిరి సలపడం లేదు… ఉక్కిరిబిక్కిరి అవుతూ మతి పోయిన వారిలా సైకోగా మారి ప్రవర్తిస్తున్నారు…సభ్యసమాజం మాట్లాడుకోలేని కుసంస్కారిలా అభ్యంతరకర విమర్శలు చేస్తున్నారు…వైకాపా జగన్ విమర్శలను ప్రజలు గమనిస్తున్నారు…రానున్న ఎన్నికల్లో ఓటర్లు బుద్ధిమాధ్యం, అధికారకాంక్ష ఉన్న అభివృద్ధి నిరోధకుల్ని చిత్తుచిత్తుగా ఓడిస్తారనడంలో తెలుగుదేశానికు సందేహం లేదు.. అన్నదాతా సుఖీభవ పథకం తెస్తున్నాం. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారుచేసి రైతుకు అండగా నిలుస్తాం.
– చంద్రబాబు
తల్లి గర్భం నుంచి చరమాంకం వరకు ప్రతి దశలోనూ సంక్షేమాన్ని అమలుచేస్తున్న స్ఫూర్తిదాయకమైన ప్రభుత్వం మాది
– యనమల
సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ భారీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. వివిధ వర్గాలపై వరాల వర్షం కురిపించింది. రైతన్నకు గుండె ధైర్యం ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచింది. సకల జనులకూ ‘కేటాయింపుల విందు భోజనం’ వడ్డించింది. ఓటర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా ‘ఎన్నికల పద్దు’ను ఆవిష్కరించింది. గతఏడాది కన్నా ఈ బడ్జెట్లో 35,113 కోట్లు అధికంగా చూపారు.
రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ మంత్రం పఠించింది. సంక్షేమానికి అగ్ర ప్రాధాన్యమిస్తూ…. సంక్షేమ పథకాలకు భారీ కేటాయింపులు చేసింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి వంటి వాటికి ఇతోధికంగా నిధులు పెంచుతూ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2019-20 సంవత్సరానికి శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. మార్చి నెలలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో ఇప్పటికే ప్రకటించిన పథకాలు అమలు చేసేందుకు వీలుగా నిధులు కేటాయించారు. అమల్లో ఉన్న ఇతర సంక్షేమ పథకాలను బాగా విస్తరించారు. కేటాయింపులు అనేక రెట్లు పెంచారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు ఉదారంగా నిధులు కేటాయిస్తోంది. సామాజిక పింఛన్ల కింద ఇస్తున్న మొత్తాన్ని రెట్టింపు చేసింది. డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం వంటి అనేక సంక్షేమ పథకాలను అమల్లోకి తెచ్చింది. ఈ బడ్జెట్లో ఆయా కార్యక్రమాలకు అగ్రతాంబూలం ఇచ్చింది. వివిధ వర్గాలకు ఆరు కొత్త సంక్షేమ పథకాలను ప్రకటించింది. రాష్ట్రంలో 86 లక్షలకుపైగా ఉన్న రైతులను ఆకట్టుకోవడానికి రూ.5,000 కోట్లతో ‘అన్నదాతా సుఖీభవ’ పథకాన్ని తీసుకువచ్చింది. క్షత్రియ సామాజిక వర్గ సంక్షేమ నిధికి రూ.50 కోట్లు కేటాయించింది.
ఆటోడ్రైవర్లకు జీవితకాల పన్ను, ట్రాక్టర్లకు త్రైమాసిక పన్ను ఇటీవలే రద్దు చేసిన ప్రభుత్వం… వారిని మరింతగా ఆదుకునేందుకు రూ.150 కోట్లతో ‘డ్రైవర్ల సాధికార సంస్థ’ను ఏర్పాటు చేసింది. ‘పసుపు-కుంకుమ’ పథకానికి గత బడ్జెట్లో రూ.1700 కోట్లు కేటాయించగా… ఈ సారి దానిని రూ.4 వేల కోట్లకు (135.29%) పెంచింది. ఈ పథకం కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేల ఆర్థిక సహాయాన్ని మూడు విడతలుగా అందిస్తోంది. ఆ మేరకు చెక్కులను ముందస్తుగా ఇచ్చేసింది. వీటిలో తొలివిడత చెక్కుల్ని మహిళలు ఇప్పటికే బ్యాంకుల్లో మార్చుకుంటున్నారు. మిగతా రెండు విడతల చెల్లింపులు మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగేలా కేటాయింపులు చేసింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు వంటి వారిని ఆదుకునేందుకు సామాజిక పింఛన్లను రెట్టింపు చేసిన ప్రభుత్వం… వీటికి కేటాయింపుల్ని 155.77 శాతానికి పెంచింది.
గత సారి పింఛన్లకు రూ.5012 కోట్లు కేటాయించగా…. ఈ సారి ఆ మొత్తాన్ని రూ.12,819.18 కోట్లకు పెంచింది. వనరుల సమర్థ వినియోగం ద్వారా సంక్షేమానికి ఎక్కువ నిధులు కేటాయించగలుగుతున్నామని, సాంకేతికతను వాడటం ద్వారా పథకాల దుర్వినియోగాన్ని అరికడుతున్నామని ఆర్థిక మంత్రి యనమల పేర్కొన్నారు. ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల పౌర సరఫరాల వ్యవస్థలో రూ.2,585 కోట్లు ఆదా చేశామని చెప్పారు.













