VR School: మంత్రుల మధ్య చిచ్చు రేపిన వీఆర్ స్కూల్ పునఃప్రారంభోత్సవం..!!

నెల్లూరు (Nellore) నగరంలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రతిష్టాత్మక వెంకటగిరి రాజా (VR High School) హైస్కూల్ పునఃప్రారంభ కార్యక్రమం ఇవాళ అట్టహాసంగా జరిగింది. మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్కూల్‌ను మున్సిపల్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ (Minister Ponguru Narayana) దత్తత తీసుకొని, రూ.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అయితే, ఈ కార్యక్రమం వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం సృష్టించింది. వీఆర్ స్కూల్ పేరు మార్చాలంటూ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Ponguru Narayana) చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.
వీఆర్ హైస్కూల్ 1875లో స్థాపించబడిన ఒక చారిత్రక విద్యా సంస్థ. గత YSRCP ప్రభుత్వ హయాంలో 2021లో ఈ స్కూల్ మూతపడింది. ఈ స్కూల్‌లో చదువుకుని అక్కడే ఉపాధ్యాయుడిగా పనిచేసిన మంత్రి నారాయణ, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పునరుద్ధరించాలని సంకల్పించారు. NCC గ్రూప్, P-4 ఇనిషియేటివ్ సహకారంతో ఈ స్కూల్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించారు. డిజిటల్ లెర్నింగ్ సాధనాలు, హైడ్రోపోనిక్స్ ల్యాబ్, అత్యాధునిక తరగతి గదులు వంటి సౌకర్యాలతో స్కూల్‌ను పునర్నిర్మించారు. ఈ ఏడాది 5,000 దరఖాస్తుల నుంచి 1,050 మంది ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు ఈ స్కూల్‌లో అడ్మిషన్ కల్పించారు. మంత్రి నారా లోకేశ్ ఈ స్కూల్‌ను ఇవాళ ప్రారంభించారు. స్కూల్ పునరుద్ధరణలో నారాయణ కృషిని లోకేశ్ ప్రశంసించారు.
అయితే ఈ కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. వీఆర్ స్కూల్ పేరు నుంచి మున్సిపల్ కార్పొరేషన్ అనే పదాలను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. మున్సిపల్ శాఖ మంత్రి ఈ స్కూల్ ను అభివృద్ధి చేసింత మాత్రాన అది మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. వీఆర్ విద్యా సంస్థలు తమ కుటుంబం పర్యవేక్షణలో ఉన్న విషయం అందరికీ తెలుసున్నారు. గత వైసీపీ ప్రభుత్వం తనపై కక్షతో.. మేనేజింగ్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించిందన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల ద్వారా ఎదిగిన తర్వాతే.. మంత్రి నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని, తమ కుటుంబం మొదటి నుంచి రాజకీయాల్లోనే ఉందని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలు కలకలం రేపాయి.
ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారాయి. స్థానికులు, పాత విద్యార్థులు స్కూల్ పేరు మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ స్కూల్‌ను ప్రభుత్వ సంస్థగా గుర్తించడం ద్వారా దాని చారిత్రక విలువను కాపాడాలని వాదిస్తున్నారు. మరికొందరు ఆనం వాదనలోని కుటుంబ పర్యవేక్షణ అంశంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వీఆర్ హైస్కూల్ పునఃప్రారంభం నెల్లూరు విద్యా వ్యవస్థలో ఒక ముందడుగుగా నిలిచినప్పటికీ, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యలు ఈ కార్యక్రమానికి వివాదాస్పద రంగు పులిమాయి. ఈ స్కూల్ చరిత్ర, దాని పేరు, యాజమాన్యంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మరి ఈ వివాదం ఏ రంగు పులుముకుంటుందో వేచి చూడాలి.