జగన్ లక్ష్యాన్ని నాశనం చేస్తున్నారే…?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్ల విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది అంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్లు వైసిపికి బలంగానే ఉన్నా సరే కొన్ని కొన్ని విషయాల్లో ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయిలో పెరుగుతుందని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు ప్రజలను బెదిరించారని ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఎక్కువగా చేస్తూ వచ్చింది. వాస్తవానికి గ్రామ పంచాయతీలలో ఇలాంటివి ఎక్కువగా జరిగాయనే అభిప్రాయం చాలా మందిలో ఉంది.
చాలామంది మధ్యతరగతి ప్రజలు తమకు సంక్షేమ కార్యక్రమాలు రావు ఏమో అని భయంతో అధికార వైసీపీకి ఓటు వేసిన పరిస్థితి. అయితే ఇప్పుడు వాలంటీర్లు ప్రజలకు సేవ చేస్తున్నా సరే ఎన్నికలు వచ్చే సమయానికి బెదిరించే విధంగా ముందుకు వెళ్ళడంతో వాలంటీర్ల పై ప్రజల అభిప్రాయం కూడా మారుతుంది. వాలంటీర్లు ప్రజలకు సేవ చేయకుండా పార్టీకి సేవ చేస్తున్నారనే ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మున్సిపల్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు స్థానిక సంస్థలు… కాబట్టి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.
కానీ సార్వత్రిక ఎన్నికలలో కూడా ఇలాగే బెదిరిస్తే మాత్రం ఏకంగా ప్రభుత్వమే మారిపోతుంది. కాబట్టి ప్రజలు కూడా పెద్దగా భయపడే పరిస్థితి ఉండదు. కొత్త ప్రభుత్వం నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా వస్తాయి. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలు కూడా రద్దు కాకుండా కొత్త సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సంక్షేమ కార్యక్రమాలను వచ్చే ప్రభుత్వం ఎలాగో ఆపలేదు కాబట్టి మరి కొన్ని కార్యక్రమాల ద్వారా ప్రజలను ఆకట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలు అందవు అనే బెదిరింపులు చేయకుండా ఉండటం మంచిది.
ఇక గ్రామాల్లో కొంతమంది రైతులు కూడా వాలంటీర్ల విషయంలో తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. గ్రామ సచివాలయాలు పనితీరు విషయంలో కూడా విమర్శలు ఎక్కువగా వస్తున్నాయి. వైసిపికి అనుకూలంగా ఉండే వాళ్లకు మాత్రమే పని చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు తెలుసా లేదా అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా వాలంటీర్లను వాడుకొనే విషయంలో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది. కాబట్టి దీని మీద వైసీపీ అధిష్ఠానం సీరియస్గా దృష్టి పెట్టకపోతే మాత్రం పార్టీ పరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి కొత్త వ్యవస్థను తీసుకువచ్చారు. దీని ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్ళే విధంగా జాగ్రత్తగా రూపకల్పన చేసుకున్నారు. కాని దీనిని వైసీపీ నేతలు నాశనం చేస్తున్నారు అనే భావన వ్యక్తమవుతోంది.













