స్టీల్ ప్లాంట్ అమ్మకం వివరాలు బహిర్గతం చేయలేం : తేల్చి చెప్పిన కేంద్రం
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిన్తూ ఉద్యమాలు సాగుతుండగానే కేంద్రం పుండు మీద కారం చల్లే వార్త ఒకటి చెప్పింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ విషయంలో ఇప్పటికే ప్రజల్లో తీవ్రమైన గందరగోళం కొనసాగుతోంది. ఏఏ విషయాలను పరిగణనలోకి తీసుకొని, కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నామన్న విషయంలో కేంద్రం స్పష్టమైన జవాబును ఇవ్వలేకపోతోంది. జాతీయ విధానంలో భాగంగానే ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పి, ప్రజలను, విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులను తీవ్ర గందరగోళంలోకి నెట్టేసింది. తాజాగా ఓ సమాధానంతో కూడా అదే విధమైన గందరగోళంలోకి నెట్టేసింది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ విషయాలకు సంబంధించిన వివరాలు చెప్పేందుకు కేంద్ర ఆర్థిక శాఖ నిరాకరించింది. స్టీల్ ప్లాంట్ అమ్మకం వివరాలను తాము బహిర్గతం చేయలేమని ఆర్థిక శాఖలో భాగమైన డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్టిమెంట్ అండ్ పబ్లిక్ అస్సెట్ మేనేజ్మెంట్ తేల్చిచెప్పింది. ఈ అంశం ఆర్థిక రహస్యాల పరిధిలోకి వస్తుందని పేర్కొంది.
ఆర్టీఐ 8(1) (ఎ) సెక్షన్ కింద భారత సార్వభౌమాధికారం, సమగ్రతలపై ప్రతికూల ప్రభావం చూపించే సమాచారమని తెలిపింది. విజయవాడకు చెందిన ఆర్టీఐ కార్యకర్త రవికుమార్ అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు ఆర్థిక శాఖ విముఖత చూపింది. స్వయంగా ప్రధాని కార్యాలయం చెప్పినా, ఆర్టీఐ ద్వారా వివరాలు ఇచ్చేందుకు డీఐపీఏఎమ్ నిరాకరించడం విడ్డూరంగా ఉంది. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ధరను ఎలా నిర్ణయిస్తారో కూడా చెప్పేందుకు ఆ విభాగం నిరాకరించింది.













