వద్దనుకుంటున్న స్టీల్ ప్లాంటే ఇప్పుడు ఆక్సిజన్ ఆపద్బాంధవి!
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ రావడంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం వ్యవహారాలు కాస్త నెమ్మదించాయని చెప్పొచ్చు. లేకుంటే ఈ సమయానికే ప్లాంటును ఎవరికో ఒకరికి కట్టబెట్టేసి ఉండేదేమో. అయితే ఇప్పుడు ఆ ప్లాంటే దేశానికి ఆపద్బాంధవిగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్ అందిస్తున్న ఆక్సిజనే ఇప్పుడు ఎన్నో రాష్ట్రాలకు ప్రాణం పోస్తోంది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆక్సిజన్ కొరత ఏర్పడింది. పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కోసం కేంద్రాన్ని వేడుకుంటున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం వద్ద కూడా తగినన్ని ఆక్సిజన్ నిల్వలు లేవు. గత నెల వరకూ విదేశాలకు ఆక్సిజన్ ఎగుమతి చేసిన భారత్.. ఇప్పుడు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితిలు ఏర్పడ్డాయి. కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని భావిస్తున్నారు. అయితే వెంటనే రంగంలోకి దిగిన మోదీ ప్రభుత్వం ఆక్సిజన్ ఉత్పత్తిని వేగవంతం చేయాలని ఆయా కంపెనీలను ఆదేశించారు. పీఎం కేర్స్ ఫండ్స్ నుంచి వంద ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యేది కాదు. అందుకే ఇప్పుడు ఉత్పత్తి అవుతున్న ప్లాంట్ల నుంచే ఎక్కువ ఉత్పత్తి చేయాలని నిర్ణయించారు.
ఆక్సిజన్ ఉత్పత్తిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతో ప్రసిద్ది. అయితే ఈ ఆక్సిజన్ మొత్తాన్న తన స్టీల్ అవసరాలకు మాత్రమే వినియోగించుకుంటోంది. ప్లాంట్ లో మొత్తం 5 ఆక్సిజన్ ప్లాంట్లు ఉన్నాయి. రోజుకు 2950 టన్నుల ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఈ ప్లాంట్లకు ఉన్నాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడడంతో రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అధికారులు ఆక్సిజన్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ను సంప్రదించారు. పారిశ్రామిక అవసరాలకు పోనూ మిగిలిన ఆక్సిజన్ ను ఆసుపత్రులకు అందించాలని కోరారు. ఇందుకు స్టీల్ ప్లాంట్ వెంటనే అంగీకరించింది.
గతేడాది విశాఖ స్టీల్ ప్లాంట్ సుమారు 8842 టన్నుల ఆక్సిజన్ ను వివిధ ఆసుపత్రులకు సరఫరా చేసి రికార్డు సృష్టించింది. ఇప్పుడు వారం రోజులుగా రోజుకు వంద టన్నుల చొప్పున ఆక్సిజన్ ను ఉత్పత్తి చేసి వివిధ రాష్ట్రాలకు పంపిస్తోంది. ఇప్పడు ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు విశాఖ స్టీల్ ప్లాంట్ కు క్యూ కడుతున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైలు వ్యాగన్లు ఆక్సిజన్ ట్యాంకర్లతో విశాఖ వస్తున్నాయి. రోజూ పది ట్యాంకర్ల ఆక్సిజన్ ను వివిధ రాష్ట్రాలకు పంపించేందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ సిద్ధమైంది. దీంతో ఇప్పుడు అందరి చూపూ విశాఖ స్టీల్ ప్లాంట్ పైనే పడింది. భారంగా మారిందనుకుని అమ్మేయాలనుకుంటున్న స్టీల్ ప్లాంటే ఇప్పుడు ఆపద్బాంధవిగా మారిందని అభిప్రాయపడుతున్నారు.













