ఆచూకీ లేని శ్రీనివాసరావు..! ముందుకొస్తున్న అతని బాధితులు!!
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్దఎత్తున ఉద్యమం జరుగుతోంది. కార్మికులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా తమదైన శైలిలో దీన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే విశాఖ స్టీల ప్లాంట్ ను పరిరక్షించుకునేందుకు కొంతమంది ఆత్మహత్యలకు కూడా సిద్ధమంటున్నారు. ఇలాగే స్టీల్ ప్లాంట్ కార్మికుడు శ్రీనివాస రావు కూడా ఆత్మహత్యకు సిద్ధమని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఒక లెటర్ రిలీజ్ చేశాడు.
శనివారం ఉదయం ఓ లేఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో కలవరం రేపింది. తోటి కార్మికుడు శ్రీనివాస రావు తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు ప్రకటించడమే ఇందుకు కారణం. అదే రోజు సాయంత్రం 5.49 నిమిషాలకు తాను సూసైడ్ చేసుకోబోతున్నట్టు శ్రీనివాసరావు వెల్లడించారు. టైమ్ కూడా చెప్పడంతో అటు కార్మికులు, ఇటు కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అతని ఆచూకీ కోసం వెతకడం మొదలు పెట్టారు. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మొదట అతను పోలీసుల అదుపులో ఉన్నాడనే ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత పోలీసులు తమ అదుపులో లేడని.. అతని కోసం గాలిస్తున్నామని ప్రకటించారు. దీంతో ఆందోళన మరింత తీవ్రమైంది.
శనివారమంతా శ్రీనివాసరావు ఆచూకీ దొరకలేదు. ఆదివారం కూడా శ్రీనివాసరావు కోసం గాలింపు కొనసాగింది. ఇంతలో శ్రీనివాసరావు తమ దగ్గర డబ్బులు తీసుకుని మోసం చేసాడంటూ కొంతమంది బాధితులు తెర ముందుకొచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడని.. అతడ్ని నమ్మి మేం డబ్బులిచ్చామని వాళ్లు చెప్పారు. దీంతో పోలీసుల దృష్టి ఈ కోణంలోకి మళ్లింది. డబ్బులు తీసుకున్నవాళ్ల నుంచి ఒత్తిడి పెరగడంతోనే తప్పించుకునేందుకు శ్రీనివాసరావు ఈ డ్రామా ఆడారా.. అనే కోణంలో దర్యాప్తు మొదలైంది. అయితే శ్రీనివాసరావు మంచి ఆస్తిపరుడు కావడంతో అతను డబ్బుల కోసం పారిపోయే వ్యక్తి కాదని కొందరు చెప్తున్నారు.
సూసైడ్ లెటర్ తో కంగారు పుట్టించిన శ్రీనివాసరావు కోసం ఓ వైపు ఆచూకీ కొనసాగిస్తూనే.. మరోవైపు అతనిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ సాగిస్తున్నారు పోలీసులు. తాజాగా మరికొందరు బాధితులు కూడా పోలీసులను ఆశ్రయించారు. ఇప్పటివరకూ సుమారు 2 కోట్ల రూపాయల మేర శ్రీనివాసరావు డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఉద్యోగాలిప్పిస్తానని చెప్పడంతోనే తాము డబ్బులు ఇచ్చినట్లు బాధితులు చెప్తున్నారు. వీళ్ల నుంచి తప్పించుకునేందుకే శ్రీనివాసరావు సూసైడ్ డ్రామా ఆడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. శ్రీనివాసరావు ఆచూకీ మాత్రం ఇంకా తెలియట్లేదు. దీంతో అతను ఎక్కడున్నాడు.. సేఫ్ గా ఉన్నాడా.. లేదంటే ఏదైనా అఘాయిత్యానికి పాల్పడ్డాడా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.













