విశాఖ స్టీల్‌ప్లాంట్ బిడ్ల దాఖలు గడువు పొడిగింపు.. మరికొన్ని సంస్థల కోసమే!
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణలో కేంద్ర ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఈ ప్రక్రియలో బిడ్ల దాఖలు గడువును మరో ఐదు రోజులు పొడిగిస్తున్నట్లు ఆర్ఐఎన్ఎల్ ప్రకటించింది. ఇంకా పలు సంస్థల నుంచి బిడ్లు వస్తాయని ఆర్ఐఎన్ఎల్ ఆశిస్తోంది. అందుకే ఈ గడువు పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌కు ఇటీవల ఈఓఐ జారీ చేశారు. దీని కోసం ఇప్పటి వరకు 22 బిడ్లు దాఖలైనట్లు సమాచారం. స్టీల్ ప్లాంట్ ఈఓఐకి స్పందించిన ఆరు విదేశీ సంస్థలు కూడా ఈ బిడ్లు వేశాయట. ఉక్రెయిన్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి కూడా బిడ్డింగ్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ బిడ్డింగ్‌లో జేఎస్‌డబ్ల్యూ, జేఎస్పీఎల్ వంటి బడా సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. అయితే సింగరేణి కాలరీస్ నుంచి ఇంకా బిడ్ దాఖలు కాలేదు. స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలా? వద్దా? అని సింగరేణి సంస్థ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీనికి మరికొంత సమయం పట్టేలా ఉందని సమాచారం. విశాఖపట్టణంలోని కొన్ని సంస్థలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ కోసం బిడ్లు దాఖలు చేశాయి. ఈ బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పాల్గొనడం కూడా తెలిసిందే. ఓ ప్రైవేటు సంస్థ తరఫున ఆయన ఈ బిడ్ వేశారు.













