విశాఖ వాసులూ అమరావతినే కోరుతున్నారు: జెఎసి
ఆంధ్రప్రదేశ్ రాజధానిని మూడు ముక్కలు చేయాలనే నిర్ణయాన్ని విశాఖ వాసులు కూడా వ్యతిరేకిస్తున్నారని, వారు కూడా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని అమరావతి పరిరక్షణ సంయుక్త కార్యాచరణ కమిటీ అభిప్రాయపడింది. జులై 4 వ తేదీ నాటికి అమరావతి ఉద్యమం 200 రోజు కి చేరుకుంటున్న సందర్భంగా నిర్వహించిన వర్చువల్ సమావేశంలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జులై 4 న ఉదయం 10 నుండి సాయంత్రం 5 వరకు కోవిడ్ నిబంధనలు అనుసరించి ఎవరి ఇంట్లో వాళ్ళు నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. అమరావతి ఉద్యమం లో 68 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని, 4న రాజధాని ఉద్యమం లో అశువులు బాసిన రైతులకు నివాళులు ఆర్పిస్తామని తెలిపారు.
రాజధాని భూముల విషయంలో కుంభకోణాలు అంటూ హడావిడి చేసిన ప్రభుత్వ పెద్దలు కొండని తవ్వి ఎలుకని కాదు కనీసం వానపాముని పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. తమ ఉద్యమం ప్రపంచ వ్యాప్తంగా 200 నగరాలు కు చేరుకుందని ఈ నెల 4న ఆయా నగరాల్లో కూడా అమరావతి వెలుగు పేరుతో నిరసన తెలియజేస్తామన్నారు. తమకు ఒక్క వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయన్నారు. ఈ ప్రభుత్వం నిధుల కోసం రాష్ట్రంలో ఉన్న భూములు అమ్ముతోందని, మరి అలాంటప్పుడు సచివాలయం అమ్మరనే గ్యారెంటీ ఉందా అంటూ కమిటీ పెద్దలు ప్రశ్నించారు. ప్రజాభీష్ఠానికి వ్యతిరేకంగా 3 రాజధానులు అంటూ తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఇకనైనా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.













