వైసీపీకి సంపూర్ణ బలం.. అయినా ఎక్కడో ఏదో అనుమానం!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ ఇంత త్వరగా ఒక ఎన్నికను చూస్తామని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇవాళ ఈ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 30న ఎన్నిక జరగబోతోంది. ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ బలం ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి వైసీపీకి దరిదాపుల్లో కూడా లేదు. అయినా ఎక్కడో ఏదో భయం వైసీపీని వెంటాడుతోంది.
విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా గెలిచిన వంశీకృష్ణ యాదవ్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ ఎలక్షన్ అనివార్యమైంది. ఈ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలనే పట్టుదలతో ఉంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా ఉత్తరాంధ్రపై మంచి పట్టున్న బొత్స సత్యనారాయణను ఇక్కడి నుంచి బరిలో నిలుపుతోంది. స్థానిక సంస్థల ప్రతినిధులతో సమావేశం అనంతరం బొత్స సత్యనారాయణ పేరును జగన్ ప్రకటించారు. అప్పటి నుంచి బొత్స సత్యనారాయణ విస్తృతంగా పర్యటిస్తున్నారు. పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో గెలిచిన ఎన్డీయే కూటమి కూడా ఈ స్థానంపై గట్టి ఆశలే పెట్టుకుంది. ఎలాగైనా వైసీపీని దెబ్బకొట్టి ఈ సీటును కైవసం చేసుకోవాలనుకుంటోంది. ఇక్కడి నుంచి ఏ పార్టీ తరపున అభ్యర్థిని నిలపాలనేదానిపై ఆ మూడు పార్టీలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి. బీజేపీ ఎంపీ సీఎం రమేశ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ అంశంపై రోజూ సమీక్ష జరుపుతున్నారు. అయితే టీడీపీ తరపున అభ్యర్థిని నిలబెట్టే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మూడు పార్టీలూ ఇంకా అభ్యర్థి ఎంపికై ఓ నిర్ణయానికి రాలేదు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది.
విశాఖ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి మొత్తం 838 ఓట్లున్నాయి. ఇందులో వైసీపీకి 615 మంది సభ్యులున్నారు. కూటమికి 215 ఓట్లున్నాయి. దీంతో ఈ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకోవడం నల్లేరుపై నడకే. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది. ఎన్నిక జరుగుతున్న జిల్లాల్లో కూడా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. సహజంగా స్థానిక సంస్థల ప్రతినిధులు అధికార పార్టీకి అండగా నిలబడాలనుకుంటారు. ఎందుకుంటే అధికార పార్టీ అండ ఉండే కలిగే ప్రయోజనాలు వేరుగా ఉంటాయి. అందుకే పలువురు వైసీపీ ప్రతినిధులు కూటమికి మద్దతిచ్చేందుకు సిద్ధమైనట్టు సమాచారం. ఇది వైసీపీని తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.













