విశాఖను కాటేసిన ‘విషానికి’ గుజరాత్ విరుగుడు…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో సంభవించిన గ్యాస్ లీకేజీ ఉదంతం సృష్టించిన భయాందోళనల నుంచి విశాఖ వాసులు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. బాధితులకు అన్ని రకాలుగా ప్రభుత్వ అండదండలు లభిస్తున్నాయి. ప్రస్తుతం గ్యాస్ లీకేజీ పూర్తిగా అదుపులోకి వచ్చిందని పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల వలవన్ స్పష్టం చేశారు. సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంఘటన పూర్వాపరాలు వివరించారు. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన చోటు చేసుకోనప్పటికీ అధికారులు సమయోచితంగా స్పందించారని, అందరూ నిద్రపోతున్నప్పుడు ఈ దుర్ఘటన సంభవించినప్పటికీ చాలా వరకూ ప్రాణాలు కాపడగలిగామన్నారు. తెల్లవారు ఝూమున ఇళ్లలో ఉన్నవారిని ఇంటి తలుపులు బద్ధలు కొట్టి మరీ బయటకు తీసుకువచ్చామని తెలిపారు. బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని అలాగే విష వాయువుకు విరుగుడుగా గుజరాత్ నుంచి ట్యూబాయిల్ ఆల్కహాల్ తెప్పిస్తున్నామని వెల్లడించారు.
విశాఖ చేరుకున్న నిపుణుల బృందం
గ్యాస్ లీకేజ్‌ని అరికట్టడానికి విశాఖకు 9 మంది నిపుణుల బృందం గురువారం రాత్రి సమయానికి చేరుకుంది. అర్ధరాత్రి నుంచి ప్రత్యేక పరికరాలతో లీకేజీకి అడ్డుకట్ట వేయనుందీ బృందం. వీరికి ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక బృందాల సహకారంతో ఈ ప్రక్రియ చేపట్టనుంది.













