ఆ హక్కు మా ఎమ్మెల్యేకు లేదా ?
విశాఖలో టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుపై వైకాపా వర్గీయుల రాళ్లదాడని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించే విశాఖ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనివ్వకుండా అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రోజురోజుకూ వైకాపా గూండాలు చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. తన నియోజకవర్గంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసే హక్కు శాసనసభ్యుడికి లేదా? అని ప్రశ్నించారు. పౌరుల ప్రాథమిక హక్కులను వైకాపా నేతలు కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, వ్యవస్థలను విచ్ఛిన్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఘటనలో గాయపడిన టీడీపీ కార్యకర్తలకు మెరుగైన చికిత్స అందించి, దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.













