వివేకా హత్య కేసు : ఉదయ్ బెయిల్ పిటిషన్పై ముగిసిన వాదనలు!
ఆంధ్రప్రదేశ్లో కలకలం రేపిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కొన్ని రోజుల క్రితం ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతని బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో వాదనలు నేడు ముగిశాయి. ఈ పిటిషన్ పై తీర్పును ఈ నెల 15కి వాయిదా వేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. నేటి విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వివేకా హత్య కేసుకు సంబంధించిన డైరీని కూడా కోర్టుకు సమర్పించారు. ఈ క్రమంలోనే వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం సరికాదని, అతనికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. బెయిల్పై బయటికొస్తే సాక్షులను ఉదయ్ ప్రభావితం చేసే ప్రమాదం ఉందని అధికారులు వివరించారు. వివేకా హత్య కేసులో ఉదయ్ ప్రమేయంపై సరైన ఆధారాలు సేకరించిన తర్వాతనే తాము అరెస్ట్ చేసినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. అలాగే ఈ హత్య కేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని సీబీఐ మరోసారి బలంగా వాదించింది. హత్యకు కుట్ర, సాక్ష్యాల ధ్వంసంలో అవినాశ్ ప్రమేయం ఉందని కోర్టుకు తెలియజేసింది.













