Visakhapatnam Steel Plant: విశాఖ ఉక్కుకి కొత్త ఊపిరి..అమరావతి నిర్మాణంలో స్థానిక స్టీల్‌కు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత, విశాఖ ఉక్కు పరిశ్రమ (Visakhapatnam Steel Plant) తిరిగి ఊపిరి పీల్చుకుంటోంది. గతంలో ఈ సంస్థను ప్రైవేటీకరణ చేస్తారని వచ్చిన ప్రచారం ప్రజల్లో తీవ్ర భయాన్ని కలిగించింది. “స్టీల్ ప్లాంట్‌ను కార్పోరేట్ కంపెనీలకు అప్పగిస్తారు అంటూ” వచ్చిన వార్తలు తీవ్ర చర్చలకు దారి తీశాయి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఎన్నో పోరాటాల వల్ల, అమరుల త్యాగాల నేపథ్యంతో విశాఖ ఉక్కు నిలబడినట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే కేంద్రం నుండి రూ. 11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీను ఈ సంస్థకు మంజూరు చేయడం విశేషం. ఇది సంస్థకు ఆర్థికంగా ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. దీని ప్రభావంగా, తాజాగా మూడో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రారంభించి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచారు. ఇదే సమయంలో విశాఖ ఉక్కు సంస్థకు మరో మంచి అవకాశం కూడా దక్కేలా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణంలో అవసరమయ్యే స్టీల్‌ను స్థానికంగా, నాణ్యతా ప్రమాణాలతో ఉన్న విశాఖ ఉక్కు నుంచే తీసుకోవాలని ప్రతిపాదన వెలువడింది.
ఈ సూచనను గాజువాక (Gajuwaka) ఎమ్మెల్యే, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) చేశారు. ఆయన, పురపాలక శాఖ మంత్రి నారాయణ (Narayana)ను కలిసి దీనిపై అధికారికంగా వినతి చేశారు. విశాఖ ఉక్కు ఉత్పత్తి నాణ్యతకు అంతర్జాతీయ గుర్తింపు ఉందని, అలాంటి స్టీల్‌ను అమరావతి నిర్మాణానికి వినియోగిస్తే నాణ్యతతో పాటు, స్థానిక పరిశ్రమ అభివృద్ధి కూడా జరగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
అమరావతిలో రానున్న నిర్మాణాలలో లక్షల టన్నుల స్టీల్ అవసరం ఉంటుందనే దృష్టితో, ఈ స్టీల్‌ను రాష్ట్రంలోనే ఉత్పత్తి చేయడం వలన ఉక్కు పరిశ్రమకు నిరంతర ఆర్డర్లు లభించనున్నాయి. ఇది పరిశ్రమ స్థిరతకు తోడ్పడుతుంది. ఇటు నిర్మాణ సామగ్రిని బాహ్యంగా కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండాచేస్తుంది. పల్లా శ్రీనివాసరావు చేసిన ఈ సూచనను పరిశ్రమ కార్మిక సంఘాలు హర్షించాయి. ఇది కార్మికుల భవిష్యత్‌కు, ప్లాంట్ స్థిరత్వానికి కీలకంగా మారుతుందని వారు భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమ బలోపేతానికి ఇది ఒక సానుకూల దిశగా తీసుకెళ్లే నిర్ణయం అయ్యే అవకాశం ఉంది.