జగన్కు ఝలక్ ఇవ్వబోతున్న విశాఖ ఎంపీ..! హైదరాబాద్కు మకాం మార్పు!!
విశాఖపట్నంలో ఇటీవల కిడ్నాప్ రేపిన కలకలం అందరికీ తెలిసిందే. ఏకంగా విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కుటుంబసభ్యులను కిడ్నాప్ చేసి 48 గంటలు బంధించారు దుండగులు. కోటిన్నరకుపైగా వసూలు చేశారు. ఇది తీవ్ర సంచలనం కలిగించింది. ఎంపీ కుటుంబానికే రక్షణ లేనప్పుడు ఇక సామాన్యులకు ఎక్కడ భద్రత లభిస్తుందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. అయితే దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని.. పోలీసులు సకాలంలో స్పందించి ఎంపీ ఫ్యామిలీని రక్షించారని అధికార పార్టీ నేతలు చెప్తున్నారు. తన కుటుంబసభ్యులు క్షేమంగా బయట పడడంతో ఎంపీ సంతోషంగా ఉన్నారు. కానీ ఈ సంఘటన ఆయన్ను తీవ్రంగా కలచివేసింది. అందుకే ఆయనో కీలక నిర్ణయం తీసుకున్నారు.
విశాఖలోని తన వ్యాపార కార్యకలాపాలన్నింటిని హైదరాబాద్ కు మార్చబోతున్నట్టు ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. తన కుటుంబసభ్యుల కిడ్నాప్ తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. కిడ్నాపర్ల చేతుల్లో తన కుమారుడు, భార్య, స్నేహితుడు తీవ్ర ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తను ఎంతో నీతి నిజాయితీగా వ్యాపారాలు చేస్తున్నప్పటికీ అందరికళ్లూ తనపైనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై సానుభూతి చూపించాల్సింది పోయి దీన్ని కూడా రాజకీయం చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. ఒక వర్గం మీడియా కూడా తనపై కక్ష సాధిస్తోందన్నారు ఎంవీవీ సత్యనారాయణ.
విశాఖలో వ్యాపారం చేయడం కూడా కష్టంగా మారిందన్నారాయన. ఇక్కడ రూల్స్ చాలా కఠినంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణం నిమిత్తం తాను ఒక బ్లాస్ట్ చేసేందుకు అధికారులకు దరఖాస్తు చేశానని.. కానీ మూడు నెలలు గడిచినా అనుమతి రాలేదన్నారు. అదే హైదరాబాద్ లో అయితే ఒక్క రోజులో పర్మిషన్ వస్తుందన్నారు. పైగా.. తాను బ్లాస్ట్ కు పర్మిషన్ అడగ్గానే విశాఖ నగరం కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విధంగా మీడియాలో కథనాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా ఆ బ్లాస్ట్ చేస్తే పబ్లిక్ కు అంతరాయం కలుగుతుందని చెప్పారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారం చేయలేమని స్పష్టం చేశారు.
అందుకే తాను త్వరలోనే తన వ్యాపారాన్ని హైదరాబాద్ షిఫ్ట్ చేయాలనుకుంటున్నట్టు ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. ప్రస్తుతం ఆరేడు ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని, అవి పూర్తి కాగానే హైదరాబాద్ కు మార్చేస్తామని తెలిపారు. తన కుటుంబసభ్యులందరూ అక్కడే ఉంటారన్నారు. తాను మాత్రం విశాఖ ఎంపీగా సేవలందిస్తానని క్లారిటీ ఇచ్చారు. ఎంవీవీ సత్యనారాయణ నిర్ణయం ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. విశాఖలో రౌడీయిజం పెరిగిపోయిందని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. సొంత ఎంపీ కూడా అలాంటి ఆరోపణలతో ఏకంగా తన కుటుంబాన్ని హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. ఇది అధికార పార్టీకి కచ్చితంగా పెద్ద దెబ్బే. మరి దీన్ని వైసీపీ ఎలా ఎదుర్కొంటుందనేది వేచి చూడాలి.













