కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీ ఖరారు
విజయవాడ నగర వాసులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. గత నెలలోనే ప్రారంభం కావాల్సిన ఫ్లైఓవర్ రెండు సార్లు వాయిదా పడుతూ వచ్చింది. చివరకు ఈ నెల 16న కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి రహదారిని ప్రారంభిస్తారని రహదారులు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. వర్చువల్ విధానంలో ఇరువురు నేతలూ పైవంతెనను ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాల్లోనూ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొంటారని ఆయన అన్నారు. పై వంతెనతో పాటు పూర్తయిన మరికొన్ని ప్రాజెక్టులను నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జాతికి అంకితం చేస్తారని తెలిపారు.













