విజయవాడలో తెలుగు రచయితల మహసభలు
విజయవాడలోని సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో 4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు జరగనున్నాయి. సభలకు హాజరయ్యేందుకు దేశవిదేశాల నుంచి 1500 మంది వరకు సాహితీవేత్తలు భాషా సాంకేతిక నిపుణులు పేర్లు నమోదు చేసుకున్నారు. ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఆధ్వర్యంలో నాలుగేళ్లకోసారి ఈ మహాసభలను నిర్వహిస్తున్నారు. భాషోద్యమాన్ని బలోపేతం చేసేందుకు సమావేశాల్లో కార్యచరణను రూపొందించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు, కార్యదర్శి డాక్టర్ జి.వి.పూర్ణచందు తెలిపారు. మాతృభాషను కాపాడుకుందాం- స్వాభిమానం చాటుకుందాం నినాదంతో ఈ ఏడాది సభలను నిర్వహిస్తున్నారు.
2019ని అంతర్జాతీయ మాతృభాషల పరిరక్షణ సంవత్సరంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించినందున తెలుగు నేలపై ఉన్న అన్ని మాతృభాషల పరిరక్షణ, అభివృద్ధి, ఆధునికీకరణ లక్ష్యంగా మహాసభల కార్యాచరణను రూపొందిస్తున్నారు. తెలుగు నేలపై ఉన్న మాతృ భాషలన్నింటిని పరిరక్షించేందుకు మాతృభాషా పీఠాల ఏర్పాటు, నిధుల సమీకరణకు సూచనలు చేయనున్నారు. మాతృభాషల అభివృద్దికి సృష్టమైన అధికారాలతో కూడిన ప్రాధికార సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వానికి సిఫారసు చేయనున్నారు. తెలుగు భాష వికాసానికి పలు సూచనలు, తీర్మానాలు చేయనున్నారు.
మహాసభల నిర్వహణకు కొమర్రాజు లక్ష్మణరావు, సభాప్రాంగణం, గిడుగు రామ్మూర్తి, సాహితీ సాంస్కృతిక వేదిక, సురవరం ప్రతాపరెడ్డి భాషా పరిశోధన వేదికలను సిద్ధం చేస్తున్నారు. మూడు రోజుల్లో ఈ వేదికలపై 15 సదస్సులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.













