Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ అరెస్ట్..! టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ట్విస్ట్..!!
గన్నవరం (Gannavaram) మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని (Vallabhaneni Vamsi) పోలీసులు అరెస్టు (Arrest) చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం టీడీపీ కార్యాలయంపై (Gannavaram TDP Office) దాడి జరిగింది. ఈ కేసులో వంశీ ఏ71గా ఉన్నారు. అయితే ఇటీవల ఈ కేసును విత్ డ్రా చేసుకుంటున్నట్టు పిటిషన్ దారుడు సత్యవర్ధన్ (Mudunuri Satyavardhan) ఎస్సీ, ఎస్టీ కోర్టులో చెప్పారు. దీంతో ఈ కేసు నుంచి వల్లభనేని వంశీ క్షేమంగా బయటపడ్డారని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడే ట్విస్ట్ నెలకొంది. ఈ ట్విస్టులో భాగంగానే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్ (Hyderabad) లో అరెస్టు చేసిన ఆయన్ను విజయవాడ తరలించారు.
వైసీపీ (YCP) అధికారంలో ఉన్నప్పుడు 2024 ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి జరిగింది. ఇందులో పలు వాహనాలతో పాటు ఆఫీసు ఫర్నీచర్ తగలబెట్టారు. దీనిపై అప్పట్లో టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ముదనూరి సత్యవర్ధన్ ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును అప్పటి ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చాక దీనిలో కదలిక వచ్చింది. తన అరెస్టు తప్పదని భావించిన వంశీ కోర్టును ఆశ్రయించి ముందస్తు ఊరట పొందారు. ఇంతలో పిటిషన్ దారుడు సత్యవర్ధన్ కూడా ఎస్సీ, ఎస్టీ కోర్టులో తనకు, ఈ కేసుకు సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసు వీగిపోయిందని అందరూ అనుకున్నారు.
పిటిషన్ దారుడిని కాపాడుకోవడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని అందరూ విమర్శించారు. అయితే తనను వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి, బెదిరించడం వల్లే తాను కోర్టులో అలా పిటిషన్ దాఖలు చేయాల్సి వచ్చిందని పిటిషన్ దారుడు సత్యవర్ధన్ వెల్లడించారు. ఈ మేరకు అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఈ ఫిర్యాదు మేరకే వల్లభనేని వంశీని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మైహోం భూజాలో నివాసం ఉంటున్న వంశీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ తరలించారు. అతనిపై ఎస్సీ, ఎస్టీ కేసుల్లో BNS సెక్షన్లు 140(1) 308, 351(3), రెడ్ విత్ 3(5) కింద కేసులు పెట్టారు.
వల్లభనేని వంశీ మరికొన్ని కేసుల్లో కూడా నిందితుడిగా ఉన్నారు. బావులపాడు మండలం ఆరుగొలనులో టీడీపీ నేత దుకాణాలను అక్రమంగా కూల్చేసిన కేసులో ఏ2గా ఉన్నారు. ఎన్నికల సమయంలో టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావుపై హత్యాయత్నం కేసు కూడా నమోదైంది. అంతేకాక గన్నవరం మాజీ పీఏసీఎస్ అధ్యక్షుడు కాసరనేని రంగబాబుపై దాడి కేసుతో పాటు హనుమాన్ జంక్షన్ లో నకిలీ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారనే ఆరోపణలపై కేసు నమోదైంది. అయితే వీటిలో చాలా వరకూ వంశీ ముందస్తు బెయిల్ పొందారు. అయితే ఇప్పుడు సత్యవర్ధన్ తాజాగా పెట్టిన కేసులో వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు.













