ఇ ఆస్పత్రిగా విజయవాడ జీజీహెచ్
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ‘ఇ’(ఎల్రక్టానిక్) ఆస్పత్రిగా రూపాంతరం చెందనుంది. పేపర్ రహిత డిజిటల్ వైద్య సేవలందించేందుకు రాష్ట్రంలోనే మోడల్ ఆస్పత్రిగా ఎంపికైంది. మార్చి 15 నాటికి ఇ-సేవలు ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ డివిజన్ హెల్త్ మిషన్‌లో భాగంగా ఈ ఆసుపత్రిని ఇ ఆస్పత్రిగా మారుస్తున్నారు. ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతి రోగికి ఆధార్ అనుసంధానిత గ్లోబల్ బేస్డ్ ఐడీని క్రియేట్ చేస్తారు. ఒకవేళ ఆ రోగికి అప్పుడే ఐడీ ఉంటే, దాని ప్రకారమే సేవలు అందిస్తారు. ఒకసారి ఐడీని క్రియేట్ చేస్తే, ఆ నంబరు జీవితాంతం ఉండిపోతుంది. రోగి ఏ ఆస్పత్రికి వెళ్లినా ఐడీ నంబరు చెబితే అతని పూర్వ చికిత్స వివరాలు, దీర్ఘకాలిక వ్యాధులు వంటివి రోగి చెప్పకుండానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. దేశంలోనే కాకుండా, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆ ఐడీ నంబర్ పనిచేస్తుంది. ఒకవేళ రోగి ఐడీ నంబర్ మర్చిపోయినా, ఆధార్ నంబర్ ఆధారంగా తెలుసుకునే వీలుంది.
ఎల్రక్టానిక్ ఆస్పత్రిగా రూపొంతరం చెందిన అనంతరం ఆస్పత్రిలో పేపర్ రహిత వైద్య సేవలు అందించనున్నారు. రోగి ఓపీకి ఐడీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు, వైద్యులు పరీక్షలు చేసి, వారు గుర్తించిన లోపాలు, రక్త పరీక్షా ఫలితాలు, సీటీ స్కాన్ , ఎంఆర్ఐ రిపోర్టులు ఇలా అన్నీ రోగి ఐడీ ఆధారంగా ఆన్లైన్లోనే ఉంచుతారు. వారి మెడికల్ రికార్డులు సైతం ఆన్లైన్లోనే ఉంటాయి. ఇన్‌పేషెంట్‌గా చేరినా రికార్డులన్నీ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆన్లైన్లోనే పొందుపరుస్తారు.













