Vijayasai Reddy: టీడీ జనార్ధన్ తో ఎందుకు భేటీ అయ్యానంటే… విజయసాయి రెడ్డి క్లారిటీ..!!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) టీడీపీ నాయకుడు టీడీ జనార్ధన్‌తో (TD Janardhan) రహస్య భేటీ అయినట్లు వైసీపీ (YCP) సోషల్ మీడియా వేదికల ద్వారా చేస్తున్న ప్రచారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించారు. వైసీపీలోని కొందరు నాయకులు తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని, తనను రెచ్చగొట్టి జగన్‌కు (YS Jagan) నష్టం కలిగించేలా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనను ఇరిటేట్ చేసి, రియాక్ట్ చేయించి, దాని ద్వారా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి నష్టం కలిగించే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు. ఈ కోటరీ చర్యల వల్ల పార్టీలో నంబర్ 2 స్థానం కోసం ప్రయత్నిస్తున్న వారికి ప్రయోజనం ఉండవచ్చు కానీ, జగన్‌కు ఎలాంటి లాభం ఉండదని ఆయన స్పష్టం చేశారు.
తనకు సంబంధం లేని స్కామ్‌లలో తనను బలిపశువుగా చేయాలని కోటరీ కుట్ర చేస్తోందని, గత నాలుగేళ్లుగా తనను అవమానిస్తోందని విజయసాయి రెడ్డి ఎక్స్ లో పోస్ట్ చేశారు. 2011లో 21 కేసులు ఎదుర్కొన్న తాను, జగన్ స్వయంగా అడిగి ఉంటే బాధ్యత తీసుకునేవాడినని, కానీ కోటరీ ద్వారా తనపై అభాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. తనను వెన్నుపోటు దారుడని, టీడీపీకి అమ్ముడుపోయిన వ్యక్తిగా చిత్రీకరించడం ద్వారా తన విశ్వసనీయతను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆయన అన్నారు.
సీఐడీ (CID) విచారణకు కొన్ని గంటల ముందు టీడీపీ నేత టీడీ జనార్ధన్ రెడ్డితో విజయసాయి రెడ్డి భేటీ అయ్యారని.. దాదాపు 45 నిమిషాల పాటు రహస్య చర్చలు జరిపారని వైసీపీ పోస్టులు పెట్టింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డి, చంద్రబాబుకు లొంగిపోయారని, రాజ్యసభ సీటును కూటమికి అమ్మేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఆరోపణలపై విజయసాయి రెడ్డి స్పందించారు. తాను ఆది శేషగిరిరావు గారి ఇంటికి వెళ్లినట్లు చెప్పారు. ఆయనతో తనకు రెండు దశాబ్దాల అనుబంధం ఉందని, ఆ కుటుంబంతో వ్యక్తిగత సంబంధాలున్నాయని తెలిపారు. అయితే టీడీ జనార్ధన్ ఆ సమయంలో అక్కడికి వస్తున్న విషయం తనకు తెలియదని, తమ మధ్య ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల నుంచి తప్పుకున్నందున టీడీపీలో చేరే ప్రసక్తే లేదని, కలవాలనుకుంటే నేరుగా నారా లోకేష్ లేదా చంద్రబాబును కలిసేవాడినని ఆయన అన్నారు.
లిక్కర్ స్కామ్‌పై వైసీపీ అధినేత జగన్ స్కామ్ లేదు అని చెబుతుండగా, విజయసాయి రెడ్డి టీడీపీ నాయకులతో స్కామ్ రహస్యాలు చర్చించేందుకు భేటీ అయ్యారని వైసీపీ కోటరీ ఆరోపిస్తోందని విజయసాయి పేర్కొన్నారు. ఈ ఆరోపణలను ఖండిస్తూ.. స్కామ్ లేనప్పుడు తాను ఏం చర్చిస్తానని ఆయన ప్రశ్నించారు. సీఐడీ విచారణలో తాను A1 గురించి మాత్రమే ప్రస్తావించానని, ఇతరుల గురించి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.
విజయసాయి రెడ్డి-టీడీ జనార్ధన్ భేటీ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. వైసీపీ ఈ భేటీని జగన్‌కు వ్యతిరేకంగా కుట్రగా చిత్రీకరిస్తుండగా, విజయసాయి రెడ్డి దానిని వ్యక్తిగత సందర్శనగా వివరించారు. ఈ వివాదం వైసీపీలోని అంతర్గత విభేదాలను, నాయకత్వంపై ఉన్న అసంతృప్తిని మరింత స్పష్టం చేసింది. ఈ ఘటన రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందనేది రాబోయే రోజుల్లో తేలనుంది.