కూతుర్ని ఎంచుకున్న విజయమ్మ.. మరి కొడుకు పరిస్థితి ఏమిటి?
ఆంధ్ర లో ఎన్నికల ప్రచారం పూర్తయిపోయింది. అయితే ఇది పూర్తి కావడానికి కంటే ముందుగా వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ ఓ వీడియోను విడుదల చేశారు. ఎవరు కనీసం ఊహించని విధంగా విడుదలైన ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మొదటి నుంచి చాలామంది భావిస్తున్నట్లుగా విజయమ్మ తన సంపూర్ణ మద్దతు కుమార్తెకు ప్రకటించింది. కడప పార్లమెంటు నియోజకవర్గం నుంచి రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిలను గెలిపించాలని ప్రజలను కోరుకుంది. ఈ వీడియోలో కేవలం కూతురు గురించి మాత్రమే మాట్లాడిన విజయమ్మ ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ గురించి లేక జగన్ గురించి మాట్లాడలేదు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న విజయమ్మ తన సోషల్ మీడియా ద్వారా ఈ వీడియోని విడుదల చేశారు. విడుదలైన కొద్దిసేపటిలోనే ఈ వీడియో వైరల్ అయింది. వీడియోలో ఎక్కడా షర్మిల ప్రత్యర్థుల గురించి ఒక మాట కూడా మాట్లాడకపోవడం విజయమ్మ సంస్కారానికి నిదర్శనం. ఆమె కేవలం రాజశేఖర్ రెడ్డి చనిపోయే వరకు ప్రజల కోసం తపన పడ్డారని.. అందుకే ఆయన బిడ్డను గెలిపించాలని కోరుకున్నారు. వీడియోలో ఆమె జగన్ గురించి ఒక్క మాట కూడా చెడుగా మాట్లాడ లేదు . అయితే మంచిగా కూడా చెప్పలేదు. దీంతో ఈ వీడియో పై మిశ్రమ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.













