కమలం పువ్వుపై మిడతల దండయాత్ర…
చాలా మంది రాజకీయ నేతలలానే ట్వీట్లు చేయడంలో చేయి తిరిగిన వైసీపీ నేత విజయసాయిరెడ్డి దాదాపు ప్రతీ రోజూ ప్రత్యర్ధులపై ట్వీట్ల సమరం సాగిస్తుంటారు. అప్పుడప్పుడూ గొంతుకకు అడ్డం పడే వ్యంగ్యోక్తులతో, చురుక్కుమని గుచ్చుకునేలాంటి పరోక్ష బాణాలతో, విచిత్రమైన ఉపమానాలతో, వైవిధ్యభరితమైన పోలికలతో ట్వీట్లు సంధిస్తుంటారు. అదే క్రమంలో ఆయన మరోసారి ట్వీట్ చేశారు. అయితే ఈ సారి ఆయన తన ప్రత్యర్ధిగా భాజాపాని ఎంచుకున్నారు.
తేదేపా నుంచి మిడతల దండు కమలం పువ్వు (భాజాపా)మీదకు దండయాత్ర ప్రారంభించిందని సదరు ట్వీట్లో తేదేపా నుంచి ఫిరాయించిన నేతలను విజయసాయి మిడతలతో పోల్చారు. ఇప్పటికే విజయవంతంగా కమలం మీద దాడిచేసిన కొన్ని మిడతలు విధ్వంసం సృష్టిస్తున్నాయని,జరుగుతున్న విధ్వంసం గురించి తెలుసుకునేలోగానే ఏడాది కాలంగా ఎటువంటి ఆహారం దొరక్క నకనకలాడుతున్న మరికొన్ని మిడతలూ ఎగురుకుంటూ బయలుదేరాయన్నారు. మిడతల దండు అనే ఈ విపత్తు నుంచి భాజాపా ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉందన్నారు.













