ఏపీ యువతికి గూగుల్ పురస్కారం
ఆంధప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన యువతి ప్రతిష్ఠాత్మకమైన గూగుల్ ఉమెన్ టెక్ మేకర్ పురస్కారానికి ఎంపికైంది. పట్టణానికి చెందిన కొల్లి శ్రీనివాసరావు, శ్రీదేవి దంపతుల కుమార్తె సుదీప విశాఖపట్నం విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం పెంచే లక్ష్యంతో గూగుల్.. ఉమెన్ టెక్ మేకర్స్ పోగ్రాం నిర్వహిస్తోంది. ఆసియా పసిఫిక్ స్థాయిలో అందించే ఈ పురస్కార పోటీలో 48 దేశాలకు చెందిన విద్యార్థినులు పాల్గొన్నారు. భారత దేశం మొత్తంమీద 39 మంది ఈ పురస్కారాన్ని గెలుచుకోగా ఆంధప్రదేశ్ నుంచి సుదీప్ ఎంపికైంది. కోడింగ్, అకడమిక్, లీడర్షిప్ రంగాల్లో ఆమె ప్రతిభ ఎంపికకు ప్రధాన కారణంగా నిలిచింది. ఈ పురస్కారం కింద సుదీపకు గూగుల్ సంస్థ అంతర్జాతీయ స్థాయి సదస్సులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దీంతోపాటు 1000 యూఎస్ డాలర్లు అందజేయనుంది. సుదీపను అభినందిస్తూ కళశాల యాజమాన్యం ఆమెను సన్మానించి రూ.లక్ష చెక్కును బహూకరించింది.













