మద్యం తలనొప్పి జగన్ కి తీర్చలేని సమస్య అయిపోయిందా??
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా పడిపోయింది అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడం, కొన్ని పరిణామాలతో రియల్ ఎస్టేట్ రంగం పడిపోవడం, అలాగే ఐటి కంపెనీలు కూడా వెనుకబడి ఉండటం, చిన్న తరహా పరిశ్రమలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనువైన మార్గం కనపడకపోవడంతో ఇప్పుడు సర్కార్ కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఇక మద్యంపై వచ్చే ఆదాయం విషయానికి వస్తే… తప్పు ఎక్కడ జరుగుతుందో గాని మద్యం ప్రియులు కూడా ఏపీలో మద్యం తాగడానికి ఆసక్తిగా లేరు.
ఇదే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురు దెబ్బ కొట్టిన అంశంగా చెప్పాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతుంది. అభ్యర్ధులు ప్రచారం నుంచి ప్రతీ ఒక్క విషయంలో కూడా మద్యానికి ప్రాధాన్యత ఇస్తారు. ఇది తప్పు అని కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మద్యం విషయంలోనే ఏపీలో రాష్ట్ర సర్కార్ కి దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు ఓటర్లకు ఇచ్చే మద్యం ఏపీలోది ఇస్తే అందరూ కూడా తిరస్కరిస్తున్నారు. మాకు వద్దంటే వద్దని చెప్పేస్తున్నారు.
దీనితో ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొస్తున్నారని ప్రచారం జరుగుతుంది. ఏపీ సరిహద్దున ఉన్న ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణా నుంచి మద్యం వస్తుంది. ఈ మద్యం కోసం ఇప్పుడు పోలీసుల సహకారం కూడా కోరుతున్నారు. ఉచితంగా ఇచ్చే మద్యం అయినా సరే ఏపీలో మద్యాన్ని తిరస్కరించడంతో అభ్యర్ధులు కూడా బలవంత పెట్టలేకపోతున్నారు. ఎమ్మెల్యేలు సహకారం అందించాలి అని స్థానిక నేతలు కూడా కోరడం ఇక్కడ హైలెట్ గా నిలుస్తున్న అంశంగా చెప్పాలి.
ఇక మరికొంత మంది స్థానిక నేతలు అయితే… స్వయంగా తామే సరిహద్దులు దాటుతున్నారు. గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఈ అక్రమ రవాణా ఎక్కువగా ఉంది. దీనితో గత నెలలో ఏపీ సర్కార్ కి ఆదాయం భారీగా పడిపోయింది. ఇప్పటికే ఏపీలో మద్యం అమ్మకాలు పడిపోయాయని రాష్ట్ర ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేస్తూ ధరలు తగ్గించింది. బీర్ బ్రాండ్ లు కూడా పాతవి మళ్ళీ తీసుకువచ్చింది. ఇప్పుడు వాటి ధరలు ఎక్కువగా ఉండటంతో చాలా మంది కొనలేకపోతున్నారు.
దీనిపై సీఎం జగన్ కూడా ఆరా తీసారని, నివేదికలు కూడా తెప్పించుకున్నారు అని సమాచారం. ఎన్నికల్లో మద్యం ప్రభావం అనేది ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి అభ్యర్ధులకు ఈ తిప్పలు తప్పడం లేదు. ఏపీలో మద్యం కొన్న అభ్యర్ధులు కేసులను దాచుకున్నారు. మరి భవిష్యత్తులో అయినా సరే నాణ్యమైన మద్యం మీద దృష్టి పెట్టి… జాగ్రత్తలు తీసుకుంటారో లేదో చూడాలి. మద్యపాన నిషేధం సాధ్యం కావడం లేదు కాబట్టి విక్రయించే మద్యం నాణ్యమైనది విక్రయిస్తే మంచిది అనే భావన ఉంది.













