ఏడాదికి ఒక్కసారే తిరుమలకు రండి
తిరుమలేశుని దర్శనం కోసం ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చేలా ప్రముఖులు స్వీయ నిర్ణయం తీసుకోవాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సూచించారు. తద్వారా సామాన్య భక్తులకు నిరీక్షణ సమయం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ నియమాన్ని పాటిస్తున్నట్లు వెంకయ్య సృష్టం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వెంకయ్య నాయుడు తిరుమలేశుడిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. అమూల్యమైన భగవత్ దర్శనం అందరికి అందుబాటులో ఉండాలి. నాకు మహద్వార ప్రవేశ అనుమతి ఉన్నప్పటికీ భగవంతుని ముందు అందరూ సమానమే అనే సనాతన ధర్మసూత్రాన్ని అనుసరించాను. సామాన్య భక్తునిలాగా సంప్రదాయ వస్త్రధారణలో వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి వచ్చిన శ్రీవారిని దర్శించుకున్నాను. నా సతీమణి ఉష దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని కోరుకున్నారు. అది నెరవేరినందున కుటుంబసభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నాను అని తెలిపారు.













