శ్రీ MVVS మూర్తి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన ఉపరాష్ట్రపతి
అమెరికా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్ర ప్రదేశ్ ఎంఎల్ సీ, విశాఖ మాజీ ఎంపీ, గీతం విద్యా సంస్థల అధ్యక్షులు శ్రీ ఎం.వి.వి.ఎస్.మూర్తి గారి పార్థివ దేహానికి ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్య నాయుడు గారు నివాళులు అర్పించారు.
శ్రీ ఎం.వి.వి.ఎస్.మూర్తి మంచితనం మూర్తీభవించిన ఆదర్శమూర్తి అని ఆయన తెలిపారు. వ్యాపార, రాజకీయ, విద్యా రంగాల్లో ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమాలు సమగ్రంగా, విజయవంతంగా నిర్వహించారని, ప్రతి కార్యక్రమాన్ని పది మందికి ఉపయోగపడే విధంగా తీర్చి దిద్దడం ఆయన ప్రత్యేకత అని వివరించారు.
గీతం విద్యాసంస్థలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు సంపాదించడం ఆయన కార్యదీక్షకు నిదర్శనమని… హైదరాబాద్, కర్ణాటకలో ఏర్పాటు చేయడమే కాకుండా ఉన్నత ప్రమాణాలతో నిర్వహించడం ద్వారా వ్యవస్థ స్థాయికి ఎదిగారని అన్నారు.
రాజకీయాల్లో ఉండి ఎప్పుడూ ఎవ్వరినీ పల్లెత్తు మాట అని ఎరుగరని, ఆయన భావాలు ఉన్నతమైనవని, అలాంటి మంచి మిత్రుణ్ని కోల్పోవడం బాధగా ఉందని అన్నారు.
ఈమధ్యే గీతంలో జరిగిన పుస్తకావిష్కరణ సభలో ఆయన్ను కలిసి మాట్లాడానని, ఇంతలో ఆయన దూరం కావడం విచారకరమన్నారు. ఆయన సేవాభావం గొప్పదని, స్వర్ణభారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్ కు ఆయన సహకారం మరువలేనిదని, ఆ విషయాన్ని ఆయన ఎవ్వరితో చెప్పలేదని తెలిపారు.
విశాఖపట్టణం పెద్దదిక్కును కోల్పోయిందని, ఆయన చేపట్టిన మంచి కార్యక్రమాలకు సహకారం అందించడమే వారికి అందించే నిజమైన నివాళి అని తెలిపారు.
ఇదే ప్రమాదంలో మృతి చెందిన సీనియర్ పాత్రికేయులు బసవపున్నయ్య గారిని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ఆదర్శవంతమైన జర్నలిజానికి ఆయన మారుపేరని తెలిపారు.













