Venkaiah Naidu :అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్టే : వెంకయ్యనాయుడు
తెలుగు రాష్ట్రాల్లో పాలన తెలుగులోనే జరగాలని, ఉత్తర్వులు మాతృభాషలోనే ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu ) అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని గోదావరి గ్లోబల్ విశ్వవిద్యాలయం (జీజీయూ) ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ తెలుగు మహాసభ (World Telugu Congress)ల్లో ఆయన మాట్లాడారు. అమ్మ భాషను మరిస్తే అమ్మను మరిచినట్టేనన్నారు. తెలుగులో మాట్లాడని వారు, తెలుగు నాయకుడు కాదన్నారు. మాతృభాషలో మాట్లాడని వారికి ఓటు వేయొద్దని సూచించారు. రాష్ట్రం బయట వున్న వారంతా తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్లూ నేర్చుకుంటున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొందరు తెలుగు వారు అమ్మ భాష మాట్లాడటం లేదు. న్యాయస్థానాల్లో మాతృభాష వాడకం పెరగాలి. సినిమా(Movie)ల్లో మాటలు, పాటల్లో తెలుగుదనం ఉండాలి. తెలుగు కోసం పత్రికలు, ప్రసార మాధ్యమాలు కృషి చేస్తున్నాయి. ఎన్టీఆర్(NTR) , నార్ల వెంకటేశ్వరరావు, రామోజీరావు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మన భాషను ఎవరో కాకుండా మనమే కాపాడుకోవాలి. భాషను ప్రేమించు, ప్రోత్సహించు, ఇతరులతో పలికించు నినాదంతో ముందుకెళ్లాలి అని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు.













