అమరావతిని రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం కలిగించింది: వెంకయ్యనాయుడు
నవ్యాంధ్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సీఎం చంద్రబాబు.. అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషం కలిగించిందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలను ఎదుర్కొని వేలాది రోజుల పాటు ఉద్యమం సాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరింద’ అని తెలిపారు. మొదటి నుంచి కూడా తాను రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని, రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదని వెంకయ్య నాయుడు చెప్పారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. ‘‘ఏపీ అయినా, మరే రాష్ట్రమైనా సరే.. సమగ్రాభివృద్ధి ఎంతో అవసరం. అయితే ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం కూడా తప్పు కాదు’’ అని ఆయన చెప్పుకొచ్చారు.













