నేను చెప్పిన రెండు పాటించి ఉంటే బాగుండేది.. చంద్రబాబు గురించి వైరల్ అవుతున్న వెంకయ్య స్టేట్మెంట్..
ప్రస్తుతం ఉన్నవారిలో సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ గా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ముప్పవరపు వెంకయ్య నాయుడు. బిజెపిలో అంతకంతకు ఎదిగి ఎంతో నిబద్దత కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెంకయ్య నాయుడు.. తన రాజకీయ కెరీర్ లో ఎన్నో పదవులను అనుభవించారు. తన అకుంటిత దీక్షతో ఉపరాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నప్పటికీ అయిన తన సొంత రాష్ట్రం లో బిజెపిని అధికారంలోకి తీసుకు రాలేకపోయారు. పరోక్షంగా చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్రంలో బిజెపి ఎదగలేక పోయింది అన్న అపవాది కూడా వెంకయ్య నాయుడు మీద. ఈ నేపథ్యంలో చంద్రబాబు గురించి ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి.
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడిన వెంకయ్య నాయుడు.. రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో పెను మార్పులు సంభవించాయని.. చట్టసభలలో నేతలు ప్రవర్తిస్తున్న వైఖరి చూస్తే బాధ కలుగుతుంది అని అన్నారు. హుందాగా ఉండి ప్రజలకు ఆదర్శంగా నిలవవలసిన పదవులలో ఉన్నవారు ఇలా ప్రవర్తించడం పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబుకు ఇచ్చిన సూచనల గురించి కూడా ప్రస్తావించారు. అప్పటివరకు ఎన్డీఏలో ఉన్న టిడిపి 2018లో బయటకు వచ్చింది. ఆ సమయంలో చంద్రబాబు ప్రత్యేకంగా వెంకయ్య నాయుడుని కలిశారట.
తనను కలవడానికి వచ్చిన చంద్రబాబుకు ఎన్డీఏ నుంచి బయటకు రావడం మంచిది కాదని అందులోనే కొనసాగమని వెంకయ్య నాయుడు సూచించారు.. అయితే ప్రస్తుతం అసంతృప్తి ఎక్కువగా ఉందని ఇలాంటి సమయంలో ఎన్డీఏలో కొనసాగడం కంటే కూడా బయటకు వెళ్లడం మంచిదని చంద్రబాబు వెంకయ్యతో అన్నారట. ఈ విషయాన్ని ఇప్పుడు వెంకయ్య నాయుడు తిరిగి ప్రస్తావించారు. అప్పుడు తన మాట చంద్రబాబు పెద్దగా పట్టించుకోలేదని.. వీటితో పాటుగా తాను ఇచ్చిన రెండు సూచనలను కూడా ఆయన పాటించలేదని వెంకయ్య నాయుడు తెలిపారు. ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళినప్పటికీ.. అప్పటి పరిస్థితుల బట్టి మోడీని విమర్శించవద్దని.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కలవ వద్దని వెంకయ్య చంద్రబాబుకు సలహా ఇచ్చారట. ఆ రెండు సలహాలు పాటించకపోవడం వల్లే చంద్రబాబు ఎలక్షన్స్ లో ఆ మూల్యాన్ని చెల్లించుకున్నాడు అన్న విషయం వెంకయ్య మాటలతో అర్థమవుతుంది.













