వేంరెడ్డి నిష్క్రమణం వెనక..?
సీఎం జగన్‌కు అత్యంత నమ్మకస్తుడు, ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిష్క్రమణ.. నెల్లూరు వైసీపీలో తీవ్ర చర్చనీయాంశమైంది. పార్టీకి ఆది నుంచి వెన్నెముకగా ఉన్న వేమిరెడ్డి.. గుడ్ బై చెప్పారు. నెల్లూరు జిల్లా అధ్యక్ష పదవికి, నెల్లూరు ఎంపీ స్థానం ఆఫర్ కు కూడా తిరస్కరించి మరి వేంరెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోయారు. ఆయన భార్య సైతం రాజీనామా చేశారు. పార్టీలో తాజా రాజకీయ పరిస్థితులపై పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇంతకూ వేమిరెడ్డి ఎందుకు పార్టీ లైన్ విబేధించి, బయటకు పోయారు.
జిల్లాలో వైసిపికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చిన నేతల్లో వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒకరు. కానీ మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ కోసం.. వేంరెడ్డిని వైసీపీ హైకమాండ్ వదులుకుంది. ఆర్థిక స్థితిమంతుడు, ఆపై పట్టున్న నాయకుడు కావడంతో ఆయనతో ఇబ్బందులు తప్పవని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. ముఖ్యంగా అనిల్ కుమార్ వ్యవహారశైలిపై వేంరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు అనిల్‌కు హైకమాండ్ ప్రాదాన్యమివ్వడం.. వేంరెడ్డికి రుచించలేదు. దీంతో ఇంక ఈపార్టీలో ఉండలేనంటూ.. బై చెప్పేశారు వేంరెడ్డి. సహచరనేతలు ఎంతగా బుజ్జగించినా.. తాను ఉండదల్చుకోలేదని వారికే నేరుగా చెప్పేశారు వేంరెడ్డి. అయితే వేంరెడ్డి.. టీడీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
గత ఎన్నికల్లో నెల్లూరులో వైసీపీ దాదాపుగా స్వీప్ చేసినంత పనిచేసింది. దీంతో ఈసారి అక్కడ గట్టి అభ్యర్థుల కోసం విపక్ష టీడీపీ ప్రయత్నిస్తోంది. సీఎం జగన్ టికెట్లు లేవని తేల్చి చెప్పడంతో.. పలువురు సిట్టింగ్‌లు, ప్రజాబలమున్న నేతలు.. టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సహా పలువురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఇప్పుడు వేంరెడ్డి సైతం ఇదే బాట పడుతున్నట్లు తెలుస్తోంది. మీకు టిక్కెట్ లేదని చెప్పే విధానం ఒకటి ఉంటుంది. కానీ ఇలా అవమానిస్తే సదరు నేత కసిగా పనిచేస్తారు. అది మొదటికే మోసం వస్తుంది. కానీ .. హైకమాండ్ ఎందుకో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. జగన్ చుట్టూ ఉన్న కోటరీ… ఈవిషయంలో అతిగా ప్రవర్తిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పరిస్థితులు ఇలాగే కొనసాగితే, మూల్యం తప్పదని భయపడుతున్నాయి.













